Let's talk: editor@tmv.in
ఈఎఫ్‌టీఏతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

ఈఎఫ్‌టీఏతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Dr.Chokka Lingam
5 అక్టోబర్, 2025

అమెరికా విధించిన 50శాతం సుంకాలతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతున్న సమయంలోనే భారత్, నాలుగు ఐరోపా దేశాల సమూహం ఈఎఫ్‌టీఏ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. గత ఏడాది మార్చిలో ఈ ఒప్పందం కుదిరింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌లో ఐస్‌లాండ్, లీచ్టెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్యదేశాలు. ఈ ఒప్పందం వల్ల వచ్చే 15ఏళ్లలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని, 10లక్షల ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో కీలకమైన విషయం భారత్ అనేక వస్తువులపై దిగుమతి సుంకాలను దశలవారీగా తగ్గిస్తుంది. దీనివల్ల స్విట్జర్లాండ్ వాచీలు, చాక్లెట్లు, ఎలక్ట్రానిక్స్, కొన్ని బ్రాండ్లకు చెందిన సైకిళ్లు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. బంగారంపై సుంకాలు మాత్రం ఈ పరిధిలోకి రావు. సుంకాల తొలగింపులు, తగ్గింపులు 10ఏళ్లవరకు అమలుచేస్తారు. తయారీరంగం, ఆభరణాలు, ఔషధాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.

ఈ ఒప్పందం వల్ల పెట్టుబడులు, టెక్నాలజీ, సర్వీసు రంగాల్లో ఆయాదేశాలకు, భారత్‌కు మధ్య సహకారం పెరుగుతుంది. ఈఎఫ్‌టీఏలో అతిపెద్ద వాణిజ్యభాగస్వామి స్విట్జర్లాండ్. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం వల్ల ఆయా దేశాలకు భారత ఎగుమతులు పెరుగుతాయి. స్విట్జర్లాండ్ నుంచి అధునాతన మెడికల్ టెక్నాలజీ భారత్‌కు అందితే, భారత్ నుంచి స్విట్జర్లాండ్‌కు జనరిక్ ఔషధాల ఎగుమతులు పెరుగుతాయి. అలాగే ఈ రాయితీలు ఉపయోగించి చిన్నస్థాయి వ్యాపారాలను ఆయాదేశాల్లో విస్తరించడానికి వీలు కలుగుతుంది.

భారత్ ఇటీవల బ్రిటన్‌తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇంకా అది అమల్లోకి రాలేదు. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్‌కు భారత ఎగుమతులు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఎగుమతి, దిగుమతి సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. వాటి నిర్వహణ సరిగ్గా ఉంటే మొదట వ్యాపారసంస్థలకు, తర్వాత వినియోగదారులకు లాభం కలుగుతుంది. అంతిమంగా అది ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది.

ఆయాదేశాల మధ్య ఎగుమతి, దిగుమతులయ్యే వస్తువుల రేట్లు రవాణా చార్జీలు, ఎగుమతి, దిగుమతిసుంకాలపైనే అధారపడిఉంటాయి. ఈ సుంకాలతో ప్రభుత్వాలకు ఆదాయం వచ్చినట్టు కనిపించినప్పటికీ, సుంకాలు అధికంగా ఉండడం వల్ల పెరిగే ధరలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగిస్తాయి. భారీ ధరలున్నవస్తువుల వినియోగం తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వాణిజ్యం జరిగితే మన దేశంలో దొరకని, విదేశాల నుంచి తప్పక దిగుమతయ్యే వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయి.

ఏ రెండు దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినా అది రెండు దేశాలకూ ఉపయోగకరంగా ఉంటుంది. అసలు రెండు దేశాల మధ్య సంబంధల్లో వాణిజ్యమే కీలక అంశం. వాణిజ్య వ్యహారాల్లో తలెత్తే సమస్యలే కొన్నిసార్లు విభేదాలకు దారితీస్తాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈఎఫ్‌టీఏ, బ్రిటన్, జపాన్, దక్షిణకొరియా, మారిషస్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలతో భారత్‌కు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలున్నాయి. వీలయినన్ని ఎక్కువదేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలుంటే వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. వినిమయం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పెరగడం ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. విదేశీ కంపెనీలు ఇతర దేశాల్లో వ్యాపారం చేసే అవకాశం రావడంతో మార్కెట్‌లో పోటీతత్వం పెరుగుతుంది. అలాగే దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి.

ఎగుమతులు, దిగుమతుల కోసం పరస్పరం ఆధారపడే దేశాలు అంత త్వరగా ఏ విషయంలోనూ ఘర్షణకు దిగవు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయాదేశాలు తమంతతాముగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచి విషయం. చాలా దేశాలు వాణిజ్యం విషయంలో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, తద్వారా దౌత్యసంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంటే ట్రంప్ మాత్రం వాణిజ్యం ద్వారా దేశాలతో శత్రుత్వం తెచ్చుకుంటున్నారు. వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికాది ఎప్పుడూ వివాదాస్పద వ్యవహారశైలే. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య కూడా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయిగానీ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ తెరవాలన్న అమెరికా ప్రతిపాదనను మన దేశం తోసిపుచ్చింది. దీంతో చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తరచుగా దిగుమతుల తగ్గింపు గురించి, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ గురించి పదే పదే చెబుతున్నారు. స్వాతంత్ర్య పోరాటంలోని స్వదేశీ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వదేశీ ఉద్యామన్ని కొనసాగించాలని పిలుపునిస్తున్నారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. దీనికి కారణం దేశాల మధ్య వైఖరి ఎప్పుడు ఎలామారుతుందో తెలియని పరిస్థితులుండడమే. దిగుమతులను పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినప్పటికీ, వీలయినంత తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మేకిన్ ఇండియాతో పాటు వీలయినన్ని ఎక్కువదేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. దిగమతులు, ఎగుమతుల కోసం భారత్ ఏఏ దేశాలపై ఆధారపడుతోందే ఆయా దేశాలన్నింటితో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరితే చాలా వస్తువులు చౌకగా లభిస్తాయి. ఈఎఫ్‌టీఏ దేశాలతో భారత్ ఒప్పందం దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుందని భావిద్దాం.

ఈఎఫ్‌టీఏతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం - Tholi Paluku