Let's talk: editor@tmv.in
ఈ-ఆఫీస్‌ అమలులో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌ తప్పదు: వీరపాండియన్‌

ఈ-ఆఫీస్‌ అమలులో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌ తప్పదు: వీరపాండియన్‌

Panthagani Anusha
14 జనవరి, 2026

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పరిపాలనను పూర్తిగా పారదర్శకంగా మార్చేందుకు ప్రవేశపెట్టిన 'ఈ-ఆఫీస్' విధానం అమలులో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్జేడీలతో నిర్వహించిన వర్చువల్ సమీక్షలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ నెల 7వ తేదీ నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కార్యాలయాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వీసు వ్యవహారాలు, డిస్పాచింగ్, ఇతర అనుమతులన్నీ తప్పనిసరిగా డిజిటల్ రూపంలోనే జరగాలని ఆదేశించారు. కేవలం కోర్టు కేసులు, బ్యాంకు చెక్కులకు మాత్రమే భౌతిక ఫైళ్లను అనుమతిస్తామని, మిగిలిన ఏ అంశమైనా ఈ-ఆఫీస్ వెలుపల జరిగితే దానిని అనధికారిక కార్యకలాపంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పారు.

డిస్ట్రిక్ట్స్ వారీగా నోడల్ ఆఫీసర్లు

ఈ నూతన విధానం అమలును పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా రాష్ట్ర నోడల్ అధికారులను నియమించామని ఎక్కడైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వారు తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ అంశంపై నిరంతరం సమీక్షిస్తున్నారని ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే వారి వివరాలను నోడల్ అధికారులు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పాటు ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్లోనే నమోదు చేయాలని స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద విడుదలైన నిధులను నిబంధనల ప్రకారం వెంటనే ఖర్చు చేయాలని లేనిపక్షంలో తదుపరి నిధుల విడుదల నిలిచిపోతుందని అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు శాఖలో ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిన కమిషనర్ అర్హులైన వారందరికీ వెంటనే పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరైన కారణం లేకుండా ప్రమోషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని పేర్కొన్నారు. అదేవిదంగా పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కారణంగా పీహెచ్‌సీల పనితీరు మందగించినట్లు ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ద్వారా స్పష్టమవుతోందని ఈ లోపాలను వెంటనే సరిదిద్ది వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలని జిల్లా అధికారులను వీరపాండియన్ ఆదేశించారు.

ఈ-ఆఫీస్‌ అమలులో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌ తప్పదు: వీరపాండియన్‌ - Tholi Paluku