
ఇస్లామిక్ రిపబ్లిక్ కూలితే వెంటనే తాత్కాలిక ప్రభుత్వం: రేజా పహ్లవి ప్రకటన
ఇరాన్‌లో ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే దేశ పరిపాలన బాధ్యతలను చేపట్టేందుకు తన నాయకత్వంలోని తాత్కాలిక (ట్రాన్సిషనల్) వ్యవస్థ సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రవాస క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావి ప్రకటించారు. దేశంలో పాలనా అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు గత కొన్ని నెలలుగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశ పునర్నిర్మాణం కోసం అనేక మంది నిపుణులు ముందుకు వచ్చారని కూడా ఆయన పేర్కొన్నారు.
శనివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో చేసిన పోస్టులో పహ్లవి మాట్లాడుతూ, ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం జరిగితే దేశంలో పాలన నిలిచిపోకుండా ఉండేందుకు రెండు ముఖ్యమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. అందులో మొదటిది “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే రూపకల్పన ద్వారా దేశ పరిపాలన ఎలా కొనసాగాలనే స్పష్టమైన ప్రణాళికను రూపొందించడం అని తెలిపారు. రెండవది, ఆ ప్రణాళికను అమలు చేసే తాత్కాలిక వ్యవస్థలో పనిచేసేందుకు అర్హత కలిగిన మహిళలు, పురుషులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు.
ఈ ప్రక్రియలో అనుభవం కలిగిన అనేక మంది ఇరానీయులు స్వచ్ఛందంగా దేశ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చారని పహ్లవి పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం తమ నైపుణ్యాన్ని వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నవారిని గుర్తించి ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ట్రాన్సిషనల్ వ్యవస్థ సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆ కమిటీకి సయీద్ ఘాసెమీనెజాద్ నాయకత్వం వహిస్తున్నారని ఆయన వివరించారు.
గత కొన్ని నెలలుగా దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి ట్రాన్సిషనల్ వ్యవస్థలోని వివిధ విభాగాలకు నాయకత్వం వహించేలా పరిశీలిస్తున్నామని పహ్లవి తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ కూలిన వెంటనే తన నాయకత్వంలోని ఈ తాత్కాలిక వ్యవస్థ దేశ పరిపాలనను చేపట్టి తక్కువ సమయంలోనే శాంతి, భద్రత, స్వేచ్ఛను పునరుద్ధరించి, ఇరాన్ అభివృద్ధి, సమృద్ధి కోసం అవసరమైన పరిస్థితులను సృష్టిస్తుందని ఆయన చెప్పారు.
ఈ ప్రకటనలు ఇటీవల పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వెలువడ్డాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో ప్రాంతీయ పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటన తరువాత పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఘర్షణలు మరింత పెరిగాయి.
దీనికి ప్రతీకార చర్యగా ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక వ్యూహాత్మక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల ప్రభావంతో కీలక సముద్ర రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన సరఫరాలపై కూడా ప్రభావం పడుతోంది.
యుద్ధం ఇప్పటికే 15వ రోజుకు చేరుకుంది. ఇరుపక్షాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ సముద్ర జలసంధిని పూర్తీగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుండటంతో అనేక దేశాల ఇంధన అవసరాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పశ్చిమ ఆసియాలో వేగంగా పెరుగుతున్న సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ప్రపంచ శాంతి, భద్రతకు పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అన్ని పక్షాలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక రెజా పహ్లవి విషయానికొస్తే ఇతడు 31 అక్టోబర్ 1960 లో జన్మించాడు. ఇరాన్ చివరి షా (రాజు) అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు. 1967లో ఆయనను ఇరాన్ యువరాజుగా (క్రౌన్ ప్రిన్స్) ప్రకటించారు. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత పహ్లవి రాజవంశం అధికారాన్ని కోల్పోవడంతో, ఆయన కుటుంబంతో కలిసి దేశాన్ని విడిచిపెట్టి ప్రవాసంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తూ, ఇరాన్‌లో ప్రజాస్వామ్య మార్పు కోసం ఉద్యమిస్తున్నారు. ఇరాన్‌లోని ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ఆయన ప్రధాన విమర్శకుడిగా ఉన్నారు, సెక్యులర్ ప్రజాస్వామ్య వ్యవస్థ, స్వేచ్ఛా ఎన్నికలు, మానవ హక్కుల పరిరక్షణ కోసం పిలుపునిస్తున్నారు. ఆయన అహింసాత్మక ప్రతిఘటనకు మద్దతు ఇస్తూ, ఇరాన్ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ప్రజలదేనని స్పష్టం చేశారు. అలాగే ఆయన తనను తాను ఇరాన్ తదుపరి రాజుగా భావించడం లేదని, దేశ ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
