Let's talk: editor@tmv.in
ఇస్లామిక్ ప్రపంచ ఐక్యతకు ఇరాన్ సైనిక ప్రతినిధి పిలుపు

ఇస్లామిక్ ప్రపంచ ఐక్యతకు ఇరాన్ సైనిక ప్రతినిధి పిలుపు

Dantu Vijaya Lakshmi Prasanna
15 మార్చి, 2026

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తున్న నేపధ్యంలో ముస్లిం దేశాల నాయకులను ఉద్దేశించి ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ఫజల్ షేకర్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా జియోనిస్టుల ప్రభావానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రపంచం ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రెస్ టీవీ ప్రసారం చేసింది.

బ్రిగేడియర్ జనరల్ షేకర్చీ మాట్లాడుతూ, “ఇస్లామిక్ రిపబ్లిక్, దాని ముస్లిం ప్రజలపై నమ్మకం ఉంచండి. అజ్ఞానం, బహుదేవత్వం, కపటత్వానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ ప్రపంచ ఐక్యత కోసం మనమందరం ఏకమవుదాం. వీటికి అమెరికా, జియోనిస్టులు నాయకత్వం వహిస్తున్నారు” వారిని కలిసి ఎదుర్కు౦దాం అని పేర్కొన్నారు. ఈ ప్రకటన ప్రపంచ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చినదిగా భావిస్తున్నారు.

ఈ పిలుపు, ఇటీవల సైనిక వాగ్వాదం తీవ్రతరం అవుతున్న సమయంలో వెలువడింది. ఇరాన్ సైనిక అధికారులు వరుసగా కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రసారాలు, వార్తా సంస్థల ప్రకారం, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

ఇంతకుముందు, ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఎబ్రహీం జోల్ఫఘారి టెలివిజన్ ప్రసంగంలో అమెరికా, జియోనిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అన్యాయంగా చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు. తాజా రక్షణ చర్యల గురించి మాట్లాడుతూ, ఫిరూజాబాద్, బందర్ అబ్బాస్ ప్రాంతాల్లో రెండు ఎంక్యూ-9 డ్రోన్లు, అలాగే తబ్రిజ్ ఆకాశంలో మరో డ్రోన్‌ను కూల్చివేశామని తెలిపారు. మొత్తం 112 డ్రోన్లు కూల్చివేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో యుద్ధ, గూఢచారి, ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయని చెప్పారు.

ఈ చర్యలు ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ,వైమానిక, నౌకాదళ బలగాలు, అలాగే హెజ్బొల్లా సమన్వయంతో చేపట్టిన విస్తృత కార్యకలాపాల్లో భాగమని తెలిపారు. అంతర్జాతీయ ఖుద్స్ దినోత్సవ ర్యాలీ అనంతరం ఈ చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

ఇక జోల్ఫఘారి తెలిపిన వివరాల ప్రకారం, ‘ఖైబర్-షేకన్’ లాంటి ఘన ఇంధన ఖచ్చితమైన క్షిపణులు, డ్రోన్లు, శత్రు లక్ష్యాలపై పెద్ద సంఖ్యలో ప్రయోగించబడ్డాయి. ఇరాన్ ఉత్తర కమాండ్, అమెరికా బలగాలు ఉన్న హైఫా, సిజారియా, జరీత్, ష్లోమీ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. అలాగే అల్దాఫ్రా, ఎర్బిల్ స్థావరాలు కూడా హెచ్చరిక తర్వాత దాడులకు గురయ్యాయని చెప్పారు. అదనంగా, టెల్ అవీవ్‌లోని ఏడు ప్రాంతాలు, రిషోన్ లెజియోన్‌లో రెండు, షోహామ్‌లో ఒక ప్రాంతం మాకు లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. అమెరికా సైనిక కమాండర్ల స్థావరాలు ‘కింగ్ సుల్తాన్’, ‘విక్టోరియా’, ‘ఎర్బిల్’ వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఈ ప్రచారం కొనసాగుతుందని జోల్ఫఘారి స్పష్టం చేశారు. “చివరి శిశుహంతకుడిని నాశనం చేసే వరకు పోరాటం ఆగదు” అని ఆయన వ్యాఖ్యానించారు. విజయం దేవుని వశమని, మరణించిన వారి కోసం న్యాయం సాధిస్తామని ఆయన తెలిపారు.

ఇదిఇలాఉంటే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన వైమానిక సామర్థ్యాలను భూగర్భ సొరంగంలో ఉంచినట్టు మెహర్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఆ టన్నెల్‌లో డ్రోన్ల ప్రదర్శన జరిగినట్లు సమాచారం.

హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్ రాయబారి అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు

మరోపక్క, హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఇరాన్ ఆరోపించింది. బ్రిటన్‌లోని ఇరాన్ రాయబారి అంతర్జాతీయ సముద్ర సంస్థలో శాశ్వత ప్రతినిధి సెయ్యద్ అలీ మౌసవి, ఈ చర్యలను “చట్టవిరుద్ధం, బాధ్యతారహితం”గా అభివర్ణించారు.

లండన్‌లో శుక్రవారం అంతర్జాతీయ సముద్ర సంస్థ అధ్యక్షుడు ఆర్సెనియో డొమింగ్వెజ్‌తో జరిగిన సమావేశంలో మౌసవి ఈ అంశాన్ని ప్రస్తావించారు. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడానికి పునరావృత దాడి చర్యలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ జలమార్గం ప్రపంచ ఇంధన సరఫరా, అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత ముఖ్యమైన మార్గంగా గుర్తింపు పొందింది.

ఇరాన్ చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం స్వీయరక్షణ హక్కులో భాగమని మౌసవి పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఇరాన్ అన్ని సైనిక సామర్థ్యాలను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.

అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ పోర్టులు, సముద్ర మౌలిక సదుపాయాలపై చేసిన బెదిరింపులను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇటువంటి హెచ్చరికలు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని, సముద్ర భద్రతకు సంబంధించిన నియమాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. నౌకాయానం, పోర్ట్ మౌలిక సదుపాయాలు, సైనికేతర సముద్ర సౌకర్యాల రంగాల్లో ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.

“ఈ బెదిరింపులు అంతర్జాతీయ చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా, అంతర్జాతీయ నౌకాయానం, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు,” అని మౌసవి పేర్కొన్నారు. అందువల్ల, అంతర్జాతీయ సమాజం ప్రత్యేకంగా అంతర్జాతీయ సముద్ర సంస్థ ఈ చర్యలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ సముద్ర సంస్థ అధ్యక్షుడు ఆర్సెనియో డొమింగ్వెజ్ సంస్థలో ఇరాన్ కీలక పాత్రను గుర్తించారు. నావికుల భద్రతను కాపాడటం, అలాగే అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం కొనసాగించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అన్ని దేశాలకు స్వీయరక్షణ హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం, నావికుల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా చూడడం అవసరమని డొమింగ్వెజ్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై, అంతర్జాతీయ నౌకాయానంపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.