Let's talk: editor@tmv.in
ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి: పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి: పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

Shaik Mohammad Shaffee
13 నవంబర్, 2025

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు వానా నగరంలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతదేశం హస్తం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పాకిస్తాన్ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసిన కుయుక్తిగా భారత్ పేర్కొంది. ఈ ఆరోపణలు చేసిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఎటువంటి సాక్ష్యాధారాలు చూపకుండానే భారతదేశంపై నిందలు మోపారు. దీనికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు.

రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలను భారతదేశం ఖండిస్తోంది. దేశంలో అంతర్గతంగా జరుగుతున్న సైన్యం ప్రేరేపిత రాజ్యాంగ విఘాతం, అధికార ఆక్రమణ నుంచి తమ ప్రజల దృష్టిని మరల్చడానికి భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు అల్లడం పాకిస్తాన్‌కు ఒక ఊహించదగిన వ్యూహం" అని అన్నారు. "ఈ వాస్తవ పరిస్థితి గురించి అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసు, కాబట్టి పాకిస్తాన్ ఈ నిస్సహాయ దృష్టి మరల్చే కుయుక్తులకు ఎవరూ మోసపోరు" అని ఆయన నొక్కి చెప్పారు.

అసలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తానే, తాము పెంచిన ఉగ్రవాద సంస్థల దాడులు తమపై జరిగిన ప్రతిసారీ నిందను భారత్‌పై నెట్టడం పరిపాటిగా మారింది. ఈ దాడికి పాకిస్తాన్‌కు చెందిన తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్ర సంస్థ బాధ్యత వహించినా కూడా, పాక్ ప్రధాని భారతదేశం వైపు వేలెత్తి చూపడం గమనార్హం.

ఇస్లామాబాద్‌ దాడి వివరాలు

ఇస్లామాబాద్‌లోని జీ-11 ప్రాంతంలో ఉన్న జిల్లా సెషన్స్ కోర్టు భవనం వెలుపల మంగళవారం ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం 12 మంది మరణించగా, 36 మంది గాయపడ్డారు. మృతుల్లో న్యాయవాదులు, సాధారణ పౌరులు ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు జరిగిన సమయంలోనే రాజధానిలో అంతర్జాతీయ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు, 6వ మార్గల్లా చర్చా కార్యక్రమం వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలతో పాటు రావల్పిండిలో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటం గమనార్హం.

ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి: పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్ - Tholi Paluku