Let's talk: editor@tmv.in
‘ఇస్రో’ స్మారక తపాలా స్టాంపులు విడుదల

‘ఇస్రో’ స్మారక తపాలా స్టాంపులు విడుదల

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇండియన్‌ స్పేస్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ఆధ్వర్యంలో జరుగుతున్న భారత మానవ అంతరిక్ష కార్యక్రమ విజయాలను గుర్తు చేసుకుంటూ భారత తపాలా శాఖ రెండు స్మారక తపాలా స్టాంపులు, సావనీర్ షీట్లను విడుదల చేసింది. కర్ణాటక పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె. ప్రకాశ్ ఈ స్టాంపులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వీ.నారాయణన్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడు శుభాంశ్‌శుక్లా పాల్గొన్నారు.

ఈ స్మారక స్టాంపులు భారత అంతరిక్ష ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ప్రారంభమై భవిష్యత్తులో చేపట్టనున్న మానవ అంతరిక్ష యాత్రల వరకు భారత పురోగతిని వీటిలో చూపించారు. అలాగే భారత శాస్త్రీయ వారసత్వానికి ప్రతీకగా జంతర్‌‌మంతర్‌‌ వంటి చారిత్రక కట్టడాలను కూడా స్టాంపుల్లో ప్రతిబింబించారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడైన విక్రమ్‌ సారాభాయ్‌ కాలం నుంచి భారత్ ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఎదిగిన ప్రయాణాన్ని ఈ స్టాంపులు ప్రతిబింబిస్తున్నాయని ఇండియా పోస్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా చంద్రయాన్-3 విజయాన్ని, రాబోయే మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌ లక్ష్యాలను ఈ స్టాంపులు గుర్తు చేస్తున్నాయని చెప్పారు. విడుదల చేసిన సావనీర్ షీట్లలో ఒకదానిలో గగనయాన్ క్రూ మాడ్యూల్‌తో పాటు భారత్ 2035 నాటికి ఏర్పాటు చేయాలనుకుంటున్న అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష స్టేషన్‌ ప్రతిరూపాన్ని చూపించారు.

ఉపగ్రహ నిర్మాణం సాధారణ ప్రక్రియగా మారింది

మరో సావనీర్ షీట్‌లో ఎక్సిమో మిషన్‌ 4 ప్రయాణాన్ని సూచించే మిషన్ ప్యాచ్‌ను ప్రతిబింబించారు. ఈ మిషన్‌లో పాల్గొన్న గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లాను గౌరవిస్తూ ఈ డిజైన్ రూపొందించారు. ఈ మిషన్ ప్యాచ్‌ను డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన శుభాంశు శుక్లా, అంతరిక్ష అన్వేషణ ఒక దేశాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ భారత అంతరిక్ష రంగం గత కొన్ని దశాబ్దాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలకు ఉపగ్రహ నిర్మాణం సాధారణ ప్రక్రియగా మారిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎల్‌వీఎం3 రాకెట్‌ సుమారు 10,000 కిలోల వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదని తెలిపారు. భవిష్యత్తులో 30,000 నుంచి 80,000 కిలోల వరకు లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపగల తదుపరి తరం ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని నారాయణన్ తెలిపారు. మొత్తం 52 టన్నుల బరువుతో ఉండే ఈ అంతరిక్ష కేంద్రానికి ఐదు మాడ్యూల్‌లు ఉండనున్నాయని చెప్పారు. మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని, 2035 నాటికి పూర్తి స్థాయి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

‘ఇస్రో’ స్మారక తపాలా స్టాంపులు విడుదల - Tholi Paluku