
ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం
టర్కీలోని ఇస్తాంబుల్ నగరం మంగళవారం మధ్యాహ్నం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బెసిక్తాస్ జిల్లాలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ (రాయబార కార్యాలయం) లక్ష్యంగా కొందరు దుండగులు జరిపిన దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు అనుమానిత దుండగులు భద్రతా దళాల కాల్పుల్లో మరణించినట్లు ప్రాథమిక సమాచారం వెలువడగా, ఇస్తాంబుల్ గవర్నర్ దావుత్ గుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ కాల్పుల పోరులో ఒక దుండగుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు ఆయన ధ్రువీకరించారు. దుండగులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు టర్కీ పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
అప్రమత్తమైన భద్రతా దళాలు
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ పరిసరాల్లో ఆయుధాలతో సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా, ఇరువర్గాల మధ్య ప్రత్యక్ష కాల్పులు మొదలయ్యాయి. ఇస్తాంబుల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, నిందితులపై తక్షణమే స్పందించి ఎదురుకాల్పులు జరిపినట్లు పేర్కొంది. కాల్పుల సమాచారం అందగానే టర్కీ స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఖాళీగా ఉన్న కార్యాలయం
ఈ దాడి జరిగిన సమయంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఖాళీగా ఉండటం పెద్ద ఊరటనిచ్చింది. బెసిక్తాస్ జిల్లాలోని ఒక భవనం 7వ అంతస్తులో ఈ కార్యాలయం ఉంటుంది. ఘటన సమయంలో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ఘటనపై టర్కీ న్యాయ శాఖ మంత్రి అకిన్ గుర్లెక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ కాల్పుల ఘటనపై అధికారికంగా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. దాడి చేసిన వారి పూర్తి వివరాలు, వారి వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
పెరుగుతున్న ముప్పు.. హై అలర్ట్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులు, యూదుల ఆస్తులపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ముఖ్యంగా 'పాస్‌ఓవర్' పండుగను పురస్కరించుకుని ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది. ఇరాన్ దాని అనుబంధ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని పేర్కొంది. గడిచిన కొద్ది కాలంగా ఇజ్రాయెల్ పౌరులకు హాని తలపెట్టే ప్రయత్నాలు రికార్డు స్థాయిలో పెరిగాయని, ఇంతటి తీవ్రమైన పరిస్థితులను తామెప్పుడూ చూడలేదని ఇజ్రాయెల్ తీవ్రవాద వ్యతిరేక విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
