Let's talk: editor@tmv.in
ఇల్లత్తూరులో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

ఇల్లత్తూరులో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

Gaddamidi Naveen
3 నవంబర్, 2025

విజయపురం మండలం, ఇల్లత్తూరు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం భారీ స్థాయిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కూట‌మి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో రాష్ట్రానికి మొత్తం 17 మెడికల్ కాలేజీలను ఆమోదించారని, అందులో 7 కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందజేశారని చెప్పారు. మిగిలిన 10 కాలేజీలు కూడా తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఏడాదిలోనే పూర్తి అయ్యేవని ఆమె పేర్కొన్నారు.

అయితే కూట‌మి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ దిశగా మలుస్తూ, పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన అన్యాయం చేస్తోందని రోజా విమర్శించారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకపోవడం, సామాన్య ప్రజలకు చౌకైన వైద్యం అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆమె హెచ్చరించారు.

విద్యా, వైద్య రంగాలను వ్యాపారంగా మార్చే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని రోజా పిలుపునిచ్చారు. మహిళలకు ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించి, “విద్యను, వైద్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత” అని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ మహిళల వద్ద నుంచి కోటి సంతకాల సేకరణ కరపత్రాలను స్వీకరించిన రోజా ప్రజలతో మమేకమై ప్రస్తుత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఇల్లత్తూరులో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ - Tholi Paluku