Let's talk: editor@tmv.in
ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి నిరసనగా ముస్లిం సంఘాల శాంతియుత కాండిల్ మార్చ్

ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి నిరసనగా ముస్లిం సంఘాల శాంతియుత కాండిల్ మార్చ్

Panthagani Anusha
3 మార్చి, 2026

ఇరాన్ దేశ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖామెనీ మృతికి నిరసనగా విజయవాడ నగరంలో ముస్లిం సోదరులు ఆదివారం రాత్రి భారీ శాంతియుత ప్రదర్శన చేపట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి జరిపిన సైనిక దాడిలో ఖామెనీ మరణించడాన్ని ఖండిస్తూ వందలాది మంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఆగిపోవాలని అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

మహమ్మద్ అలీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అలీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ వైఖరిపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచానికి మేమే శాంతిని కాపాడేవాళ్లమని చెప్పుకునే అగ్రరాజ్యాలు బాంబులతో సామాన్య ప్రజలను, పిల్లలను చంపడం ఎంతవరకు న్యాయం? అని ముస్తాక్ అలీ ప్రశ్నించారు. యుద్ధాలు సైన్యాల మధ్య జరగాలి కానీ ఇళ్లను కూల్చి నిరపరాధులను బలి తీసుకోవడం అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ర్యాలీలో పాల్గొన్న మత పెద్దలు మిర్జా అలీ ఇమామ్, ఆల్తాఫ్ రజా మాట్లాడుతూ ఖామెనీ ఎప్పుడూ అణచివేతకు గురయ్యే పేద దేశాల పక్షాన నిలబడ్డారని గుర్తుచేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఒక గొప్ప నాయకుడిని ప్రపంచం కోల్పోయిందని వారు పేర్కొన్నారు. ఎన్ని ఆధునిక ఆయుధాలు ఉన్నా మానవ విలువలను ఎవరూ అడ్డుకోలేరని తాము ఎప్పుడూ శాంతి మార్గంలోనే తమ నిరసనను తెలుపుతామని స్పష్టం చేశారు. నగర వీధుల్లో సాగిన ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు.