Let's talk: editor@tmv.in
ఇరాన్ సుప్రీం లీడర్ మరణంపై భారత్ సంతాపం

ఇరాన్ సుప్రీం లీడర్ మరణంపై భారత్ సంతాపం

Pinjari Chand
6 మార్చి, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయోతుల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ గురువారం సంతాపం వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ ఢిల్లీలోని ఇరాన్ దౌత్య కార్యాలయాన్ని సందర్శించి భారత ప్రభుత్వ తరఫున గురువారం సానుభూతి సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మిస్రీ ఇరాన్ రాయబారి ముహమ్మద్ ఫతాలీను కలిసి, సంతాప పుస్తకంలో సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించారు. ఈ దాడి పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఇప్పటివరకు పశ్చిమ ఆసియా సంక్షోభం పరిష్కారం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే జరగాలి అని మాత్రమే స్పందించింది. ఖమేనీ మరణంపై ప్రారంభంలో అధికారిక వ్యాఖ్య చేయలేదు. అయితే విదేశాంగ కార్యదర్శి ఇరాన్ ఎంబసీకి వెళ్లి సంతాపం తెలియజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఖమేనీ మరణంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.