
ఇరాన్ లో ఆగని నిరసన జ్వాలలు
ఇరాన్ అంతటా దాదాపు రెండు వారాలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి శనివారం నాటికి తీవ్ర స్థాయికి చేరాయి. నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా కొనసాగుతున్నాయని దేశ ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇరాన్‌లో ఇంటర్నెట్ నిలిపివేయటం, ఫోన్ లైన్లు కట్ చేయటంతో విదేశాల నుంచి నిరసనల స్థాయిని అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఈ నిరసనల్లో ఇప్పటివరకు కనీసం 65 మంది మరణించగా, 2,300 మందికి పైగా అరెస్టయ్యారు. దేశ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖామెనీ త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చారు. దీనిపై అమెరికా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఈ సంకేతాలు వెలువడ్డాయి. ఇరాన్‌లోని ధైర్యవంతమైన ప్రజలకు అమెరికా మద్దతు ఇస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. వేరే ప్రకటనలో స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇలా హెచ్చరించింది. ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఆటలు ఆడొద్దు. ఆయన ఏదైనా చేస్తానంటే, అది చేస్తారు.
అనుకూల వార్తలతో ప్రభుత్వ ప్రచారం
ఇరానియన్ ప్రభుత్వ టీవీ భద్రతా బలగాలకు జరిగిన నష్టాలపై వార్తలు ప్రసారం చేస్తూనే, దేశంలో పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని చూపించే ప్రయత్నం చేస్తోంది. శనివారం ఇరాన్‌లో పని వారానికి ఆరంభం అయినప్పటికీ, అనేక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాయని ప్రభుత్వ టీవీ తెలిపింది. ప్రభుత్వ టీవీ తరచుగా ప్రముఖ ఇరానియన్ స్వరకర్త మజీద్ ఎంతేజమీ రూపొందించిన ‘ఎపిక్ ఆఫ్ ఖోర్రమ్‌షహర్’ అనే యుద్ధోన్ముఖ వాద్య సంగీతాన్ని ప్రసారం చేస్తూ, ప్రభుత్వ అనుకూల ర్యాలీల దృశ్యాలను చూపించింది. ఈ సంగీతం 1982లో ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో ఖోర్రమ్‌షహర్ నగర విముక్తిని స్మరించేందుకు రూపొందించింది. 2022లో మహ్సా అమిని మరణానికి నిరసనగా మహిళలు తమ జుట్టు కత్తిరించిన వీడియోల్లో కూడా ఈ సంగీతాన్ని ఉపయోగించారు. రాత్రివేళ దేశంలోని చాలా నగరాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వ టీవీ యాంకర్ పేర్కొన్నారు. గత రాత్రి కొందరు ఆయుధాలతో ఉన్న ఉగ్రవాదులు ప్రజా స్థలాలపై దాడులు చేసి, ప్రజల వ్యక్తిగత ఆస్తులను తగలబెట్టినప్పటికీ, టెహ్రాన్ సహా చాలా ప్రావిన్సుల్లో గుమికూడడం లేదా అశాంతి జరగలేదన్న సమాచారం ఉందని ఆయన అన్నారు.
అయితే, ఈ వాదనలను అసోసియేటెడ్ ప్రెస్ ధృవీకరించిన ఒక ఆన్‌లైన్ వీడియో పూర్తిగా ఖండించింది. ఆ వీడియోలో టెహ్రాన్ ఉత్తరంలోని సాదాత్ అబాద్ ప్రాంతంలో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టినట్లు కనిపించింది. ఖామేనీకి మరణ శిక్ష అంటూ ఒక వ్యక్తి నినాదాలు చేశాడు. రెవల్యూషనరీ గార్డ్‌కు సన్నిహితంగా ఉన్న సెమీ అఫిషియల్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఇస్ఫహాన్‌లో జరిగిన నిరసనలంటూ సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేసింది. అందులో ఒక నిరసనకారుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్టు కనిపించగా, మరికొందరు మంటలు అంటించి, పెట్రోల్ బాంబులు విసురుతున్నట్టు ఉంది.
ప్రభుత్వ టీవీకి అనుబంధంగా ఉన్న యంగ్ జర్నలిస్ట్స్ క్లబ్ ప్రకారం, గాచ్సరాన్ నగరంలో రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన స్వచ్ఛంద బసీజ్ బలగాల్లో ముగ్గురు సభ్యులు నిరసనకారుల చేతిలో హతమయ్యారు. అలాగే హమదాన్ ప్రావిన్సులో ఒక భద్రతా అధికారి కత్తిపోటుకు గురై మృతి చెందగా, బందర్ అబ్బాస్ పోర్టు నగరంలో ఒక పోలీసు, గిలాన్‌లో మరో పోలీసు మరణించారు. మష్హద్‌లో కూడా ఒక వ్యక్తి హతమయ్యాడని సమాచారం.ప్రభుత్వ టీవీ టెహ్రాన్ దక్షిణాన ఉన్న షియా మత విద్యాకేంద్ర నగరమైన ఖోమ్‌లో జరిగిన అంత్యక్రియల దృశ్యాలను కూడా ప్రసారం చేసింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు.
వారాంతంలో మరిన్ని నిరసనలు
ఇరాన్ ప్రభుత్వం గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, అంతర్జాతీయ ఫోన్ సేవలను నిలిపివేసింది. అయితే కొన్ని ప్రభుత్వ, సెమీ అఫిషియల్ మీడియా సంస్థలకు మాత్రమే వార్తలు ప్రచురించేందుకు అనుమతి ఇచ్చింది. ఖతార్ ప్రభుత్వ మద్దతుతో నడిచే అల్ జజీరా న్యూస్ నెట్‌వర్క్ మాత్రం ఇరాన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసే ఏకైక ముఖ్యమైన విదేశీ మీడియా సంస్థగా కనిపించింది.
విదేశాల్లో నివసిస్తున్న ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లవి, గురువారం–శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చిన అనంతరం, శనివారం, ఆదివారం కూడా ప్రజలు వీధుల్లోకి రావాలని కోరారు. ఆయన షా పాలన కాలంలో వాడిన సింహం–సూర్యుడు జెండాతో నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌కు పహ్లవి ఇచ్చిన మద్దతు గతంలో విమర్శలకు గురైంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత. కొంతమంది నిరసనల్లో షా పాలనకు మద్దతుగా నినాదాలు వినిపించినప్పటికీ, అవి నిజంగా పహ్లవికి మద్దతా, లేక 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందున్న కాలానికి తిరిగి వెళ్లాలన్న ఆకాంక్షా అన్నది స్పష్టంగా లేదు.
ఈ నిరసనలు డిసెంబర్ 28న ప్రారంభమయ్యాయి. ఇరానియన్ కరెన్సీ రియాల్ విలువ కుప్పకూలి, ఒక డాలర్‌కు 14 లక్షలకు పైగా మారకం రేటు చేరుకోవడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. అణు కార్యక్రమం కారణంగా విధించిన అంతర్జాతీయ ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. అనంతరం ఇవి మరింత తీవ్రరూపం దాల్చి, నేరుగా ఇరాన్ మతాధిపత్య పాలనకే సవాల్ విసిరే స్థాయికి చేరుకున్నాయి.
ఒక్క రోజులోనే 22 ప్రావిన్సుల్లో 116 నిరసనలు
పాలసీ రీసెర్చ్ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ (ఐఎస్ డబ్ల్యూ) శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 8న స్థానిక సమయం మధ్యాహ్నం 3:30 నుంచి ఇరాన్‌లోని 22 ప్రావిన్సుల్లో మొత్తం 116 నిరసనలు నమోదయ్యాయి. ఈ నివేదిక ప్రకారం వీటిలో 20 భారీ నిరసనలు ఉన్నాయి. పాల్గొనేవారి సంఖ్య వెయ్యికి మించి ఉన్న నిరసనలను ఐఎస్ డబ్ల్యూ భారీ నిరసనలుగా నిర్వచించింది.
ఎక్స్‌లో ఐఎస్ డబ్ల్యూ పోస్ట్
జనవరి 8న మధ్యాహ్నం 3:30 (ఈటీ) తర్వాత నుంచి 22 ప్రావిన్సుల్లో 116 నిరసనలను క్రిటికల్ థ్రెట్స్ ప్రాజెక్ట్, ఐఎస్ డబ్ల్యూ నమోదు చేశాయి. ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా నిరసనకారులు వీడియోలు, సమాచారాన్ని బయటకు పంపలేకపోవడంతో, వాస్తవంగా జరిగిన నిరసనల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది నిరసనకారులు స్టార్‌లింక్ ద్వారా విదేశీ మీడియాకు సమాచారం పంపినట్లు సమాచారం. ఇదే రోజు ముందుగా నిరసనలను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసిందని, అయినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయని సంస్థ పేర్కొంది. నిరసనల సమన్వయాన్ని అడ్డుకోవడం, అణచివేత పరిమాణాన్ని దాచడం కోసం ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగిస్తోంది. అయినా కూడా ఈ షట్‌డౌన్ మధ్య ఇరాన్ అంతటా విస్తృతంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఇంటర్ నెట్ బంద్
నిరసనలు ఇంతగా విస్తరించాయి కాబట్టి, వాటిని అణిచివేయడంలో భద్రతా బలగాల సామర్థ్యానికే సవాల్‌గా మారుతున్నాయి. జనవరి 8, 9 తేదీల్లో ఇరాన్‌లోని పలు నగరాల్లో నిరసనకారులు ప్రభుత్వ సంస్థలకు నష్టం కలిగించారు. స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ దళాలు ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో, నిరసనలను అణిచేందుకు ప్రభుత్వం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌పై మరింతగా ఆధారపడే అవకాశముందని తెలిపింది.
స్టార్‌లింక్ ద్వారా ఇరాన్ నుంచి తనకు వచ్చిన వీడియోలను పంచుకుంటూ ప్రముఖ ఇరానియన్ జర్నలిస్ట్, కార్యకర్త మసీహ్ అలీనెజాద్ ‘ఇరాన్ నియంత 90 మిలియన్ల ప్రజల కోసం ఇంటర్నెట్‌ను 24 గంటలకు పైగా నిలిపివేశాడు. ఇంటర్నెట్ అనేది ఇరాన్ ఉద్యమానికి ప్రాణవాయువు. స్టార్‌లింక్ సేవలను ఇరాన్ విప్లవకారులకు అందుబాటులోకి తేవడం ద్వారా ఎలాన్ మస్క్ ప్రజాస్వామ్య పోరాటానికి కీలకమైన, తప్పనిసరి సహకారం అందించారని తెలిపారు. ఇంటర్నెట్‌ను పర్యవేక్షించే నెట్‌బ్లాక్స్ సంస్థ ఇరాన్‌లోని ఇంటర్నెట్ బ్లాక్‌పై వివరాలు వెల్లడించింది:
ఇరాన్‌లో ఉదయం 8 గంటలైంది. మరో రాత్రి నిరసనలు, అణచివేత తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు. గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ అయ్యి 36 గంటలైంది. దీని వల్ల ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల భద్రత గురించి తెలుసుకునే అవకాశం తీవ్రంగా పరిమితమైంది.
ఇదిలా ఉండగా, నిరసనల నేపథ్యంలో హత్యలు, అరెస్టులను ప్రపంచ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేసి, ఇరాన్ ప్రజలు చూపిస్తున్న ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ప్రభుత్వ అణచివేతను తీవ్రంగా ఖండించారు.
