Let's talk: editor@tmv.in
ఇరాన్‌ లొంగిపోవాల్సిందే.. ట్రంప్‌ హెచ్చరిక

ఇరాన్‌ లొంగిపోవాల్సిందే.. ట్రంప్‌ హెచ్చరిక

Shaik Mohammad Shaffee
16 మార్చి, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా తన దూకుడును మరింత తీవ్రతరం చేస్తూ.. ఆ దేశం వెంటనే లొంగిపోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ, ఆ దేశం ప్రతిపాదించిన నిబంధనలు తనకు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమాలను పూర్తిగా వదులుకుంటేనే ఏదైనా ఒప్పందం కుదురుతుందని, అది కూడా చాలా పటిష్టంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

వినోదం కోసం మరిన్ని దాడులు

ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా ఉన్న ఖర్గ్‌ చమురు ఎగుమతుల కేంద్రంపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయని ట్రంప్ ధ్రువీకరించారు. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ దీవి ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు ప్రధాన ద్వారంగా (సుమారు 90 శాతం) ఉంది. ఇప్పటికే అక్కడి సైనిక మౌలిక సదుపాయాలను అమెరికా దాడులు పూర్తిగా తుడిచిపెట్టాయని ఆయన ప్రకటించారు. అంతటితో ఆగకుండా “మరింత వినోదం కోసం ఆ దీవిపై మరికొన్నిసార్లు దాడులు చేయవచ్చు" అంటూ శత్రుదేశాన్ని హేళన చేస్తూ హెచ్చరించారు. చమురు పైప్‌లైన్లను పునర్నిర్మించడానికి చాలా ఏళ్లు పడుతుంది కాబట్టి, ప్రస్తుతానికి వాటిని మినహాయించి మిగిలిన సైనిక వ్యవస్థలను నామరూపాలు లేకుండా చేశామని వివరించారు.

సుప్రీం లీడర్‌ అదృశ్యంపై అనుమానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ క్షేమ సమాచారంపై ట్రంప్ సందిగ్ధత వ్యక్తం చేశారు. తన తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన మోజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. "ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఎవరూ ఆయనను మీడియా ముందు చూపించలేదు. ఒకవేళ ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం తెలివైన పని చేసి వెంటనే లొంగిపోవాలి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సైతం స్పందిస్తూ.. దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడి ఉండవచ్చని, ఆయన జారీ చేసిన ప్రకటనలు చాలా బలహీనంగా ఉన్నాయని పేర్కొన్నారు.

హోర్ముజ్ రక్షణకు అంతర్జాతీయ కూటమి

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధిని రక్షించడానికి ట్రంప్ అంతర్జాతీయ దేశాల సహకారాన్ని కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపి చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. ఇరాన్ బెదిరింపుల నుంచి ఈ కీలక జలమార్గాన్ని కాపాడుకోవడం ఆయా దేశాల బాధ్యత అని, దీనికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పేర్కొన్నారు. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.