Let's talk: editor@tmv.in
ఇరాన్‌ యుద్ధం ముగించడంలో అమెరికా తికమక

ఇరాన్‌ యుద్ధం ముగించడంలో అమెరికా తికమక

Pinjari Chand
13 మార్చి, 2026

పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా దుందుడుకు చర్యలకు ప్రస్తుతం ఫలితం అనుభవించే సయమంలో నిలుస్తోంది. ఇరాన్‌తో ఓ వైపు చర్చలు జరుగుతుండగానే దాడులు చేసింది. దీంతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులను మొదలుపెట్టి కాలుదువ్వాయి. అనుకున్నట్లే మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయోతుల్లా అలీ ఖమేనీని, ఆయన పరివారాన్ని అంతమొందించి యుద్ధంలో ముందున్నామని జబ్బలు చరుచుకున్నాయి. ఇరాన్ తమకు చిక్కినట్టే అని ఇరుదేశాలు భావించాయి. కానీ అసలు సమస్య అప్పుడే ప్రారంభమైంది. ఇరాన్‌లో అత్యంత ప్రభావవంతమైన సైనిక సంస్థలలో ఒకటైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌‌జీసీ) చేతుల్లోకి యుద్ధం వెళ్లింది. సుప్రీం లీడర్ లేకపోయినా దేశ భవిష్యత్‌ కోసం స్వతంత్ర నిర్ణయాలతో ముందుకువెళ్​లడం ఈ సంస్థ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం. సుప్రీం లీడర్‌‌ మరణం తరువాత గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్‌‌బేస్‌లపై, ఇజ్రాయెల్‌ పై ముమ్మరంగా దాడులు ప్రారంభించింది. అయితే చాలా క్షిపణులను, డ్రోన్లను ఆయా దేశాలు గగనతలంలోనే కూల్చివేశాయి. అయినా పట్టువదలక ఇరాన్ నిరంతరం దాడులను తీవ్రతరం చేస్తూనే ఉంది. ఓ వైపు అమెరికా, ఇజ్రాయెల్‌ లెబనాన్, ఇరాన్‌లోని లక్ష్యిత దాడులను తీవ్రతరం చేశాయి. ఈ సమయంలో ఆసుపత్రులు, పాఠశాలలపై దాడులు చేసి యుద్ధ తీవ్రత ప్రపంచానికి తెలిసేలా తమ శక్తిని చాటాయి.

ట్రంప్‌పై ముప్పేటా విమర్శలు

యుద్ధం 13 రోజులు దాటుతున్నా ఓ కొలిక్కిరాకపోవడంతో అమెరికాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొందరపడి కదనరంగంలోకి దిగారు అన్నట్టు విమర్శలు తీవ్రం కావడం, అలాగే ప్రపంచ దేశాలకు చమురు రవాణా చేసే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు పెరగడం, ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడం, గల్ఫ్ దేశాల్లో ఆందోళనలు మొదలవడం, ఎయిర్‌‌పోర్టుల్లో జనజీవనం స్థంభించిపోవడం, అలాగే ఇప్పటివరకు ఉన్న చమురు నిల్వలు అడుగంటుతుండడంతో అన్ని దేశాలు అమెరికాపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నాయి. యుద్ధాన్ని త్వరగా విరమించుకోవాలని చర్చలు ప్రారంభించాయి. ట్రంప్ ఓ వైపు మేకపోతు గాంభీర్యంగా అస్పష్టమైన ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. హర్ముజ్‌ను మూసివేస్తే 20 రెట్లు అధికంగా ఇరాన్‌పై దాడులు చేస్తామని బెదిరింపులు, యుద్ధం ఎప్పుడు ముగించాలో నా చేతుల్లోనే ఉంది లాంటి ప్రకటనలు డోల్లగా మాటలుగా మిగిలిపోతున్నాయి. ఇరాన్‌ షాహెద్‌ డ్రోన్ల నిర్వీర్యానికి అమెరికా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుండడంతో చారణా కోడికి..బారాణా మసాలా ఖర్చు అయినట్టు 20 వేల డాలర్ల ఖర్చుతో తయారు చేసినవాటిని అడ్డుకునేందుకు లక్షల డాలర్లు ఖర్చు అవుతుండడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఖర్చు తడిసిమోపడవుతోంది. యుద్ధం ముగించి తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, తదితర దేశాల నేతలతో మంతనాలు సాగిస్తోంది.

ఇరాన్‌ చేతుల్లోకి యుద్ధ పరిస్థితులు

యుద్ధం ముగించాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ చేతుల్లోకి వెళ్లాయి. ఇది తాము కోరుకున్న యుద్ధం కాదని చెబుతూనే ఇదే అదనుగా ఇరాన్ ప్రభుత్వం యుద్ధం ముగించడానికి మూడు షరతులు ప్రకటించడం ఈ సంక్షోభంలో మరో ఆసక్తికర మలుపు. తమ చట్టబద్ధ హక్కులను గుర్తించాలి, యుద్ధ పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడులు జరగకుండా అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని కోరుతోంది. అయితే గతంలో జరిగిన ‘జాయింట్‌ కాంప్రెహెన్సివ్‌ ప్లాన్ ఆఫ్‌ యాక్షన్‌ ఒప్పందం’ అనుభవం ఈ డిమాండ్లపై అనుమానాలను పెంచుతోంది. అంతర్జాతీయ హామీలు ఎంతవరకు స్థిరంగా ఉంటాయనే ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది.

అమెరికా మెడికల్‌ టెక్నాలజీపై సైబర్‌‌దాడులు

అలాగే ఉద్రిక్తతలు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశించాయి. ప్రారంభంలో ఇది సముద్ర మార్గాలు, చమురు సరఫరాలు, వైమానిక దాడుల పరిమితిలో ఉన్న సైనిక ఘర్షణగా కనిపించింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే ఈ యుద్ధం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే బహుముఖ ఘర్షణగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సముద్ర మార్గాలు, చమురు మార్కెట్లు, సైబర్ నెట్‌వర్క్‌లు, ఆరోగ్య రంగం వరకు ఈ ప్రభావం విస్తరించడం యుద్ధ స్వభావం ఎంత వేగంగా మారుతోందో స్పష్టంగా చూపుతోంది. ఇక ఈ ఘర్షణలో అత్యంత ఆందోళనకరమైన పరిణామం సైబర్ రంగంలో కనిపించింది. ఇరాన్‌కు అనుబంధంగా పేర్కొనబడుతున్న హ్యాకర్ గ్రూప్ హండాల అమెరికా మెడికల్ టెక్నాలజీ సంస్థ స్ట్రైకర్‌‌ కార్పోరేషన్‌పై భారీ సైబర్ దాడి చేశామని ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులకు ఉపయోగించే శస్త్రచికిత్స పరికరాలు తయారు చేస్తుంది. సైబర్ దాడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడింది. ఇరాన్‌ను తక్కువ అంచనా వేసిన అమెరికాకు ఈ స్థాయిలో చుక్కలు చూపిస్తోంది.

సైబర్ భద్రతా పరిశోధన సంస్థలు, ముఖ్యంగా యూనిట్‌ 42 వంటి సంస్థలు ఈ గ్రూప్‌కు ఇరాన్ గూఢచారి వ్యవస్థతో సంబంధాలు ఉండొచ్చని విశ్లేషిస్తున్నాయి. ఈ దాడిలో ఉపయోగించిన ‘వైపర్ మాల్వేర్’ విధానం డేటాను లాక్ చేసి డబ్బు కోరే రాన్సమ్‌వేర్‌లా కాకుండా పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా ఉండటం గమనార్హం. అంటే ఇది ఆర్థిక లాభం కోసం కాకుండా వ్యూహాత్మక ప్రతీకార చర్యగా భావించవచ్చు. ఈ పరిణామం యుద్ధం ఇప్పుడు ఆరోగ్య రంగానికీ చేరిందనే ఆందోళనను పెంచుతోంది. శస్త్రచికిత్స పరికరాలు, ఆసుపత్రి నెట్‌వర్క్‌లు, వైద్య డేటా వంటి వ్యవస్థలు సైబర్ దాడుల లక్ష్యంగా మారితే దాని ప్రభావం కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలపై దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.

ఇటీవలి సంఘటనలు ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆధునిక యుద్ధం ఇక సంప్రదాయ సైనిక రంగంలో మాత్రమే జరగడం లేదు. ఇది సముద్ర మార్గాలు, ఆర్థిక వ్యవస్థలు, సైబర్ నెట్‌వర్క్‌లు, సమాచార వ్యవస్థలు, ఆరోగ్య రంగం వరకు విస్తరించే బహుముఖ ఘర్షణగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని కేవలం సైనిక విజయాల కొలమానంలో చూడటం సరిపోదు. అంతర్జాతీయంగా రాజనీతి ప్రయత్నాలు, సైబర్ భద్రతా సహకారం, గ్లోబల్ సరఫరా వ్యవస్థల రక్షణ వంటి అంశాలు కూడా సమానంగా కీలకం అవుతున్నాయి. లేకపోతే ఒక ప్రాంతంలో ప్రారంభమైన ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపే దీర్ఘకాలిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధం ప్రారంభమైన గంటల్లోనే విజయం సాధించామని ఊదరగొట్టినప్పటికీ, భౌతిక పరిస్థితులు మాత్రం ఆ విధంగా కనిపించడం లేదు. సముద్ర మార్గాల్లో ట్యాంకర్లపై దాడులు, హోర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న సైనిక చర్యలు యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందని సూచిస్తున్నాయి. మరోవైపు ప్రపంచదేశాలను ఇప్పటికే గ్యాస్‌ సంక్షోభం తాకుతోంది. ఇప్పటికే ఇండియా లాంటి భారీ జనాభా కలిగిన దేశంలో ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా లేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కోట్లాదిమందిపై ఇప్పటికే ప్రభావం చూపడం మొదలైంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోవాలని కోరుకోవడం తప్ప మనముందు మరో ఆలోచన లేదు.