Let's talk: editor@tmv.in
ఇరాన్ యుద్ధం: అమెరికాకు ఐరోపా మిత్ర దేశాల షాక్‌

ఇరాన్ యుద్ధం: అమెరికాకు ఐరోపా మిత్ర దేశాల షాక్‌

Shaik Mohammad Shaffee
1 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా జరుపుతున్న దాడుల వ్యవహారం ఇప్పుడు అగ్రరాజ్యం మిత్రదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్‌పై దాడులకు తమ గడ్డను గానీ, గగనతలాన్ని గానీ వాడుకోవడానికి వీల్లేదని ఐరోపాలోని కీలక దేశాలైన ఇటలీ, స్పెయిన్ స్పష్టం చేయగా.. తమ రక్షణ కవచాలను తరలించే ప్రసక్తే లేదని పోలాండ్ తేల్చిచెప్పింది. తమ అనుమతి లేకుండా సైనిక స్థావరాలను యుద్ధ అవసరాలకు వాడటంపై ఇటలీ ఆగ్రహం వ్యక్తం చేయగా, అమెరికా యుద్ధ విమానాల కోసం స్పెయిన్ తన గగనతలాన్నే మూసివేసి సంచలనం సృష్టించింది.

పోలాండ్ 'పేట్రియాట్' షాక్!

తాజాగా పోలాండ్ కూడా అమెరికా అభ్యర్థనను తోసిపుచ్చింది. తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన 'పేట్రియాట్' క్షిపణి బ్యాటరీలలో ఒకదానిని మధ్య ప్రాచ్యానికి (పశ్చిమాసియా) పంపాలని అమెరికా కోరింది. అయితే, దీనికి పోలాండ్ రక్షణ మంత్రి కోసినియాక్-కామిస్జ్ ససేమిరా అన్నారు. "మా పేట్రియాట్ బ్యాటరీలు పోలిష్ ఆకాశాన్ని, నాటో తూర్పు సరిహద్దులను రక్షించడానికి కేటాయించినవి. వాటిని మరెక్కడికీ తరలించే ప్రణాళిక మాకు లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రష్యా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తమ సొంత రక్షణే తమకు ప్రాధాన్యమని పోలాండ్ తేల్చిచెప్పడం గమనార్హం.

అనుమతి లేదు.. రావొద్దు: ఇటలీ

ఇటలీలోని సిగోనెల్లా వైమానిక స్థావరాన్ని వాడుకోవడానికి అమెరికాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో సోమవారం ప్రకటించారు. పశ్చిమాసియాకు వెళ్లే క్రమంలో కొన్ని అమెరికా యుద్ధ విమానాలు సిగోనెల్లాలో ల్యాండ్ కావాలని ప్రణాళిక రచించాయి. అయితే దీనిపై ఇటలీ సైనిక నాయకత్వాన్ని అమెరికా సంప్రదించలేదు సరికదా.. విమానాలు గాలిలో ఉండగా సమాచారం పంపడంపై ఇటలీ ప్రభుత్వం మండిపడింది. "మేము ఎవరితోనూ యుద్ధం చేయడం లేదు.. యుద్ధం వైపు వెళ్లాలని కూడా అనుకోవడం లేదు" అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం కేవలం సాంకేతిక, లాజిస్టికల్ సాయానికి మాత్రమే ఈ స్థావరాలను వాడాలని, దాడుల కోసం వాడాలంటే తమ అనుమతి తప్పనిసరని ఆమె తేల్చిచెప్పారు.

గగనతలం క్లోజ్.. స్పెయిన్ కఠిన నిర్ణయం

ఇదే సమయంలో స్పెయిన్ కూడా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్ ఘర్షణలతో సంబంధం ఉన్న అమెరికా విమానాలు తమ గగనతలం గుండా వెళ్లడానికి వీల్లేదని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ ప్రకటించారు. మోరోన్, రోటా వంటి ఉమ్మడి సైనిక స్థావరాలను అమెరికా కార్యకలాపాలకు వాడకుండా ఇప్పటికే ఆంక్షలు విధించారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ నేతృత్వంలోని స్పెయిన్ ప్రభుత్వం, పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

నాటో దేశాలకు అమెరికా హెచ్చరిక

మిత్రదేశాల తీరుపై అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. స్పెయిన్ నిర్ణయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఘాటుగా స్పందించారు. "అమెరికా లేకపోతే నాటో అనేదే లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఐరోపా రక్షణ కోసం అమెరికా వేల కోట్లు ఖర్చు చేస్తోందని, వేలాది మంది సైనికులను పంపిందని.. ఇప్పుడు మిత్రదేశాలు సహకరించకపోతే యుద్ధం తర్వాత నాటో కూటమి ప్రయోజనాలపై పునఃసమీక్ష చేస్తామని హెచ్చరించారు. మరోవైపు సెనేటర్ లిండ్సే గ్రాహం వంటి వారు స్పెయిన్‌పై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.