Let's talk: editor@tmv.in
ఇరాన్‌ యుద్ధంలో షాహిద్‌ డ్రోన్లను కూల్చేశాం: జెలెన్‌స్కీ

ఇరాన్‌ యుద్ధంలో షాహిద్‌ డ్రోన్లను కూల్చేశాం: జెలెన్‌స్కీ

Shaik Mohammad Shaffee
11 ఏప్రిల్, 2026

ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో రష్యా తయారీ 'షాహెద్‌' డ్రోన్లను తమ దళాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. తమ మిత్రదేశాలకు రక్షణ కల్పించే వ్యూహంలో భాగంగానే ఉక్రెయిన్‌ సైన్యం ఈ ఆపరేషన్లలో పాల్గొందని ఆయన వెల్లడించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఉక్రెయిన్‌లో తయారైన అత్యాధునిక ఇంటర్‌సెప్టార్‌ డ్రోన్లను ఉపయోగించి ఇరాన్‌ డ్రోన్ల ముప్పును తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.

ఆయుధాలకు బదులుగా ఇంధనం, ఆర్థిక సహకారం

ఈ ఆపరేషన్లు కేవలం శిక్షణ కోసమో లేదా విన్యాసాల కోసమో చేసినవి కావని, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టినవని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో దాదాపు 228 మంది ఉక్రెయిన్ నిపుణులు మోహరించినట్లు ఆయన తెలిపారు. ఈ సైనిక సాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు, ముడి చమురు, డీజిల్‌తో పాటు ఆర్థిక తోడ్పాటు అందుతోందని వెల్లడించారు. ఉక్రెయిన్‌ ఇంధన స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ఒప్పందాలు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు.

వరుస సవాళ్లు.. అమెరికా రాయబారులకు ఆహ్వానం

రానున్న రోజులు ఉక్రెయిన్‌కు ఎంతో కీలకమని, ముఖ్యంగా యుద్ధం, రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లను తమ దేశానికి రావాలని కోరారు. అలాగే రష్యాను కూడా కలిపి చర్చలు జరిపే ఆలోచనను ఆయన బయటపెట్టారు. ఇదే సమయంలో రష్యా చమురుపై ఉన్న ఆంక్షలను ఏమాత్రం సడలించవద్దని, అలా చేస్తే పుతిన్‌కు ఆర్థికంగా బలం చేకూరి యుద్ధాన్ని మరింత పెంచుతారని జెలెన్‌స్కీ హెచ్చరించారు.

ఈస్టర్‌ వేళ కాల్పుల విరమణకు సిద్ధం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన 'ఈస్టర్‌ కాల్పుల విరమణ'పై జెలెన్‌స్కీ సానుకూలంగా స్పందించారు. ఈస్టర్‌ పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు (32 గంటలు) యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు పుతిన్ ప్రకటించగా.. ఉక్రెయిన్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. "ప్రజలకు ముప్పు లేని ఈస్టర్ కావాలి. రష్యా ఈ విరామాన్ని శాంతి దిశగా అడుగులు వేసేందుకు ఉపయోగించుకోవాలి" అని జెలెన్‌స్కీ తన 'ఎక్స్‌' ఖాతాలో పేర్కొన్నారు. అయితే గతంలో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఉల్లంఘన ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో, ఈ తాత్కాలిక విరమణ ఎంతవరకు అమలవుతుందనేది వేచి చూడాలి.

ఇరాన్‌ యుద్ధంలో షాహిద్‌ డ్రోన్లను కూల్చేశాం: జెలెన్‌స్కీ - Tholi Paluku