Let's talk: editor@tmv.in
ఇరాన్ మహిళలకు ఏపీ ప్రభుత్వ అండ…రూ.1 లక్ష ఆర్థిక సహాయం

ఇరాన్ మహిళలకు ఏపీ ప్రభుత్వ అండ…రూ.1 లక్ష ఆర్థిక సహాయం

Panthagani Anusha
11 ఏప్రిల్, 2026

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. రాష్ట్రంలో విద్యనభ్యసిస్తున్న ఇరాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కోర్సు చదువుతున్న జీనాబ్, సుల్మజ్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇరాన్ దేశానికి చెందిన మహిళలు. ఇటీవల తమ ఆర్థిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ కుటుంబాల నుంచి ఆర్థిక సహాయం అందడంలో ఇబ్బందులు తలెత్తినట్లు వారు వివరించారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా రెవెన్యూ అధికారిని కలసి సహాయం కోరారు.

వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ వెంటనే స్పందించి వారికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఇందులో రూ.50,000 జిల్లా సంజీవని నిధి నుంచి మిగతా రూ.50,000 విశాఖలోని కనకమహాలక్ష్మి దేవస్థానం ద్వారా సమకూర్చారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న విదేశీ విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.