Let's talk: editor@tmv.in
ఇరాన్‌ ప్రభుత్వ మద్దతుదారులపై అమెరికా ‘వీసా’ అస్త్రం

ఇరాన్‌ ప్రభుత్వ మద్దతుదారులపై అమెరికా ‘వీసా’ అస్త్రం

Shaik Mohammad Shaffee
6 ఏప్రిల్, 2026

ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఉండి, అమెరికాలో నివసిస్తున్న ఆ దేశీయులపై ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్ మాజీ సైన్యాధ్యక్షుడు ఖాసీం సోలెమనీ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు కీలక వ్యక్తుల గ్రీన్‌కార్డులు, వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్న విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అగ్రరాజ్యం స్పష్టం చేసింది.

విద్వేషపూరిత వ్యాఖ్యల ప్రభావం

2020లో అమెరికా జరిపిన దాడిలో మరణించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసీం సోలెమనీ మేనకోడలు హమీదా సోలెమనీ అఫ్షర్, ఆమె కుమార్తెను ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. లాస్ ఏంజెల్స్‌లో ఏళ్ల తరబడి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వీరు.. బహిరంగంగా ఇరాన్ ప్రభుత్వానికి మద్దతు తెలపడమే కాకుండా, అమెరికాపై దాడులను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు గుర్తించారు. "అమెరికాను 'గ్రేట్ సాటన్' (పెద్ద సైతాన్) అని పిలుస్తూ, మా దేశ వ్యతిరేక ఉగ్రవాద ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చే విదేశీయులకు ఇక్కడ చోటు లేదు" అని మార్కో రూబియో 'ఎక్స్' వేదికగా ఘాటుగా స్పందించారు. అఫ్షర్ భర్తపై కూడా అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు.

ఈ జాబితాలో కేవలం సోలెమనీ బంధువులే కాకుండా మరికొందరు కీలక నేతల వారసులు కూడా ఉన్నారు. గత నెలలో జరిగిన దాడిలో మరణించిన ఇరాన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు అలీ లారిజానీ కుమార్తె ఫాతిమా అర్దేషిర్ లారిజానీ వీసాను కూడా రూబియో రద్దు చేశారు. ఆమె భర్త సయ్యద్ కలంతర్ మొతమేది వీసాను కూడా రద్దు చేయగా, ప్రస్తుతం వారు అమెరికాలో లేరని సమాచారం. అమెరికాలో విద్యావేత్తలుగా చలామణి అవుతున్నప్పటికీ, ఇరాన్ ప్రభుత్వ అనుకూల ధోరణిని కలిగి ఉన్నారనే కారణంతోనే వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దౌత్యవేత్తలపై ముందుగానే నిఘా..

నిజానికి ఈ వీసాల రద్దు పర్వం గతేడాది డిసెంబర్‌లోనే మొదలైంది. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ మిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ అంబాసిడర్‌తో పాటు పలువురు సిబ్బందికి వీసాలను పొడిగించడానికి అమెరికా నిరాకరించింది. గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను అప్పట్లో వెల్లడించకపోయినప్పటికీ, ఇరాన్‌తో నెలకొన్న తాజా యుద్ధం, నిరసనల నేపథ్యంలో ఈ చర్యలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిని త్వరలోనే ఇరాన్‌కు పంపించేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇరాన్‌ ప్రభుత్వ మద్దతుదారులపై అమెరికా ‘వీసా’ అస్త్రం - Tholi Paluku