Let's talk: editor@tmv.in
ఇరాన్ పై దాడులను ప్రధాని ఖండించాలి: ఎంపీ అసదుద్దీన్

ఇరాన్ పై దాడులను ప్రధాని ఖండించాలి: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
14 మార్చి, 2026

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శుక్రవారం చారిత్రక మక్కా మసీదులో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై ఘాటైన విమర్శలు చేశారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ విధానాన్ని ప్రధాని మోదీ పక్కన పెట్టారని ఓవైసీ ఆరోపించారు.పెట్రోల్, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనతోనే ప్రధాని మోదీకి గురువారం అకస్మాత్తుగా తన 56 అంగుళాల ఛాతి గుర్తుకు వచ్చిందని, అందుకే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారని ఓవైసీ ఎద్దేవా చేశారు.

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని షియాల ముస్లింలకు నాయకుడని పేర్కొన్న ఓవైసీ, ఇరాన్‌పై జరిగిన దాడిని భారత్ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దోహా, దుబాయ్, బహ్రెయిన్, కువైట్ వంటి ప్రాంతాల్లో జరిగిన పరిణామాలపై కూడా భారత్ స్పందించాల్సిందని తెలిపారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో కలిసి మోదీ సమావేశం కావడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇది భారత విదేశాంగ విధానానికి సరిపోతుందా అని ప్రశ్నిస్తూ, గత 80 ఏళ్లుగా భారత్ తటస్థ విధానాన్ని పాటిస్తూ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. దాడులు జరిగిన తర్వాత కాకుండా, పది రోజుల ముందే మోదీ ఫోన్ చేసి హెచ్చరించాల్సింది. ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు.

ఇదే సమయంలో, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్‌పై దాడి చేయాలని తాను మద్దతు తెలిపిన విషయాన్ని కూడా ఓవైసీ గుర్తుచేశారు. అయితే చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. ఇస్లాం మతానుయాయులను విభజించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ఇరాన్‌పై దాడులు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం వెనుక కుట్ర ఉందని ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఒంటరైన నెతన్యాహును ఆదుకోవడానికే మోదీ అక్కడికి వెళ్లారని, ఇజ్రాయెల్ పార్లమెంటులో ఉనికిలో లేని అవార్డును మోదీకి ఇచ్చి భారత్‌ను అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అంశంపై మాట్లాడుతూ, హిందూ చట్టాలను ముస్లింలపై బలవంతంగా రుద్దకూడదని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై ద్వేషం, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయన్న ఆందోళనను కూడా ఓవైసీ వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ముస్లింల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపించారు.

ఇక జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన దాడిని కూడా ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య సమాజంలో రాజకీయ నాయకులపై బెదిరింపులు లేదా దాడులు జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు.