Let's talk: editor@tmv.in
ఇరాన్ పాఠశాలపై బాంబు దాడి బాధితులకు చైనా 2 లక్షల డాలర్ల సహాయం

ఇరాన్ పాఠశాలపై బాంబు దాడి బాధితులకు చైనా 2 లక్షల డాలర్ల సహాయం

Dantu Vijaya Lakshmi Prasanna
15 మార్చి, 2026

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన ఘోర క్షిపణి దాడిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు చైనా అత్యవసర మానవతా సహాయం ప్రకటించింది. ఈ ఘటనపై స్పందించిన చైనా ప్రభుత్వం, బాధితులకు 2 లక్షల అమెరికన్ డాలర్లు అందించనున్నట్లు తెలిపింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ‌ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సహాయాన్ని మానవతా దృక్పథంతో అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ నిధులను రెడ్ క్రాస్ సొసైటి ఆఫ్ చైనా ద్వారా ఇరాన్‌కు చెందిన ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ కి అందజేస్తారు. ఈ సహాయం పాఠశాలపై జరిగిన దాడిలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు, గాయపడిన వారికి తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపయోగపడుతుందని చైనా తెలిపింది. చైనా ప్రభుత్వం ఈ దాడిలో మరణించిన పిల్లల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలిపింది.

ఫిబ్రవరి 28న ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని మినాబ్ నగరంలో ఉన్న షజరె తయ్యిబెహ్ బాలికల ప్రాథమిక పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది. పాఠశాలలో బోధన జరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడిలో 165నుంచి180 మంది వరకు మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది చిన్నారులు కావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ దాడిలో దాదాపు 95 మంది వరకు గాయపడినట్లు కూడా సమాచారం.

ఈ ఘటనకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. అయితే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. మరోవైపు ఇజ్రాయిల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమకు ఈ ప్రాంతంలో జరిగిన సైనిక చర్యల గురించి సమాచారం లేదని పేర్కొంది. ఈ ఘటనను యుద్ధంలో జరిగిన అత్యంత ప్రాణ నష్టానికి కారణమైన దాడులలో ఒకటిగా భావిస్తున్నారు.

పౌరులపై, ముఖ్యంగా పాఠశాలలపై దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన అని చైనా తీవ్రంగా ఖండించింది. పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం మానవత్వానికి విరుద్ధమని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించేందుకు మానవతా దృక్పథంతో అవసరమైన సహాయం కొనసాగిస్తామని చైనా ప్రకటించింది.