Let's talk: editor@tmv.in
ఇరాన్ దాడులపై ఐరాసలో తీర్మానం.. భారత్ సహా 135 దేశాలు మద్దతు

ఇరాన్ దాడులపై ఐరాసలో తీర్మానం.. భారత్ సహా 135 దేశాలు మద్దతు

Shaik Mohammad Shaffee
13 మార్చి, 2026

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ గురువారం తీర్మానం ఆమోదించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పోరు రెండు వారాలకు చేరువవుతున్న తరుణంలో, అంతర్జాతీయ సమాజం ఇరాన్ దూకుడును తప్పుబట్టింది. ఈ తీర్మానానికి భారత్ సహా దాదాపు 140 దేశాలు మద్దతు తెలపడం విశేషం.

ఏడు దేశాలపై దాడుల ఖండన

బహ్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానంపై 15 సభ్య దేశాలు గల భద్రతా మండలిలో ఓటింగ్ నిర్వహించగా.. 13 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా, చైనా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్‌లోని జనావాసాలు, పౌర వస్తువులపై ఇరాన్ జరిపిన దాడులను మండలి తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి విఘాతం కలిగించేలా ఇరాన్ చేస్తున్న హెచ్చరికలను, కవ్వింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఇతర గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపాలని స్పష్టం చేసింది.

రష్యా తీర్మానం తిరస్కరణ

సమావేశం సందర్భంగా రష్యా ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ తీర్మానాన్ని మండలి తోసిపుచ్చింది. ఏ దేశం పేరు ప్రస్తావించకుండా, తటస్థంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనకు కేవలం నాలుగు ఓట్లు మాత్రమే రావడంతో అది వీగిపోయింది. రష్యా తీర్మానాన్ని బ్రిటన్ ప్రతినిధి తీవ్రంగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ శాంతి గురించి రష్యా మాట్లాడటం ‘వంచన’ అని అభివర్ణించారు. లాత్వియా ప్రతినిధి సైతం రష్యా వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు తీర్మానం ఏకపక్షంగా ఉందని, దాడులకు దారితీసిన అసలు మూలాలను ఇది ప్రతిబింబించడం లేదని రష్యా, చైనా ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

భద్రతా మండలిలో వాదోపవాదాలు

ప్రస్తుత ఉద్రిక్తతలకు ఇరాన్‌దే పూర్తి బాధ్యత అని ఫ్రాన్స్ ప్రతినిధి నిలదీయగా, అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ ‘ఇరాన్ అన్ని దిశలా దాడులు చేస్తోంది’ అని విమర్శించారు. ఇజ్రాయెల్ ప్రతినిధి ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూ.. నగరాలపై, పౌరులపై దాడులు చేయడం ముమ్మాటికీ తప్పని అన్నారు.

మరోవైపు ఇరాన్ ప్రతినిధి మాత్రం ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది తమ దేశానికి జరిగిన ‘అన్యాయం’ అని, భద్రతా మండలి విశ్వసనీయతను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. దౌత్యం, అంతర్జాతీయ చట్టాల పట్ల నిబద్ధతతోనే తాము ఈ తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు లైబీరియా వంటి దేశాలు పేర్కొన్నాయి.