Let's talk: editor@tmv.in
ఇరాన్, గల్ఫ్ దేశాల్లో అత్యవసరమైతే తప్ప తెలుగువారు బయటకు రావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్, గల్ఫ్ దేశాల్లో అత్యవసరమైతే తప్ప తెలుగువారు బయటకు రావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
2 మార్చి, 2026

గల్ఫ్ దేశాలు, ఇరాన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం స్పందించారు. ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప బయటకు ఆయన సూచించారు. స్థానిక పరిస్థితులను గమనిస్తూ, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.

అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. అవసరమైతే వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఇరాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన వెల్లడించారు. అక్కడి భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని సీఎం స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.