Let's talk: editor@tmv.in
ఇరాన్‌ కీలక ఆయిల్‌ ద్వీపంపై అమెరికా దాడులు

ఇరాన్‌ కీలక ఆయిల్‌ ద్వీపంపై అమెరికా దాడులు

Dantu Vijaya Lakshmi Prasanna
15 మార్చి, 2026

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన కీలక ఆయిల్‌ నెట్‌వర్క్‌లో భాగమైన ఖర్గ్ ఐలాండ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయని ప్రకటించారు. ఈ ద్వీపంలో ఇరాన్‌ ప్రధాన ఆయిల్‌ ఎగుమతి టెర్మినల్‌ ఉండటంతో అది దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది. అయితే ప్రస్తుతం ఆయిల్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని, కానీ నౌకల రాకపోకలను అడ్డుకుంటే ఆయిల్‌ సదుపాయాలపై కూడా దాడులు చేయడానికి వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. ఈప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది.

ఇటీవల ప్రారంభమైన యుద్ధంలో ఇరాన్‌ ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై మిసైల్‌, డ్రోన్‌ దాడులను కొనసాగిస్తోంది. అదే సమయంలో ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్‌ రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను కూడా ఇరాన్‌ అడ్డుకుంటున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ అయ్యే ఆయిల్‌లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో 2,500 మంది మెరైన్స్‌ను మధ్యప్రాచ్యానికి పంపిస్తోంది. అలాగే 31వ మెరైన్ ఎక్స్పెండీషనరీ యూనిట్ కు చెందిన దళాలు, యూఎస్ఎస్ ట్రిపోలి అనే అంబిఫిబియస్‌ అసాల్ట్‌ నౌకను కూడా ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ దళాలు సముద్ర మార్గంలో దాడులు చేయడం, రాయబార కార్యాలయాల భద్రతను బలోపేతం చేయడం, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి విభిన్న ఆపరేషన్లను నిర్వహించగలవు. అయితే ఈ చర్యలు తప్పనిసరిగా భూసైనిక యుద్ధానికి సంకేతం కాదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

ఇరాన్‌ మీడియా సంస్థ ఫార్స్‌ వార్తా సంస్థ ప్రకారం ఖార్గ్ ద్వీపంపై జరిగిన అమెరికా దాడుల్లో కనీసం 15 భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, నౌకాదళ స్థావరం, విమానాశ్రయ కంట్రోల్‌ టవర్‌, అలాగే ఒక ఆయిల్‌ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌ హ్యాంగర్‌ వంటి సైనిక లక్ష్యాలను అమెరికా బలగాలు టార్గెట్‌ చేసినట్లు తెలిపింది. అయితే ఆయిల్‌ టెర్మినల్‌కు పెద్దగా నష్టం జరగలేదని కూడా పేర్కొంది.

ఇదే సమయంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్ మహ్మద్ బాకర్ కలిబాఫ్ అమెరికా దాడులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ దక్షిణ సముద్ర సరిహద్దుల్లో ఉన్న ద్వీపాలపై దాడులు జరిగితే తమ దేశం ఇకపై ఎలాంటి నియంత్రణ పాటించదని తెలిపారు. దీనికి తోడు ఇరాన్‌ సైనిక ప్రధాన కార్యాలయం ప్రతినిధి ఎబ్రహీం జోల్ఫఘారీ కూడా అమెరికాతో సంబంధం ఉన్న ఆయిల్‌ కంపెనీలు లేదా అమెరికా వాటాలు ఉన్న ఎనర్జీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సముదాయంపై కూడా దాడి జరిగింది. అక్కడి హెలిప్యాడ్‌పై ఒక మిసైల్‌ పడినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ రాయబార కార్యాలయం ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికా దౌత్య కేంద్రాల్లో ఒకటి. గతంలో కూడా ఇరాన్‌కు అనుబంధ మిలీషియా గ్రూపులు అక్కడ రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో అమెరికా తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఒక ప్రధాన చౌరస్తాలో జరిగిన భారీ ర్యాలీ సమయంలో కూడా ఒక పెద్ద పేలుడు సంభవించింది. వేలాది మంది పాల్గొన్న క్వాడ్స్ డే ర్యాలీలో పాలస్తీనా మద్దతుగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. పేలుడు జరిగిన సమయంలో ఇరాన్‌ న్యాయవ్యవస్థ అధిపతి గోలామ్‌హొసేన్ మొహ్సేని ఎజెయి అక్కడే ఉన్నారు.

ఇక అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో ఇప్పటికే 15,000కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగాయి. రోజుకు వెయ్యికి పైగా సైనిక లక్ష్యాలను అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాలు టార్గెట్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. అలాగే హర్ముజ్ జలసంధిలో పరిస్థితిని అమెరికా సమగ్రంగా పర్యవేక్షిస్తోందని, ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.