
ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి.. డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన
ఇరాన్‌లోని అణు కేంద్రాల భద్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం నేపథ్యంలో, అణు కర్మాగారాలపై దాడులు జరిగితే అవి పెను విపత్తుకు దారితీస్తాయని హెచ్చరించింది. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో తాజాగా జరిగిన దాడిపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ స్పందిస్తూ.. "ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది అణు ప్రమాదానికి దారితీస్తుంది. దీని ప్రభావం రాబోయే తరాల ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది" అని ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
బుషెహర్ ప్లాంట్‌పై క్షిపణి దాడి.. సిబ్బంది మృతి
శనివారం ఉదయం బుషెహర్ అణు ప్లాంట్ పరిసరాల్లో ఒక క్షిపణి శకలం పడటంతో అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఒక సిబ్బంది మరణించినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. ఇటీవలి వారాల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ దాడిలో ప్లాంట్‌లోని ప్రధాన విభాగానికి నష్టం వాటిల్లనప్పటికీ, ఒక అనుబంధ భవనం దెబ్బతిన్నట్లు ఇరాన్ వార్తా సంస్థ 'తస్నీమ్' వెల్లడించింది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని, రేడియేషన్ స్థాయిల్లో కూడా మార్పు లేదని నివేదికలు పేర్కొన్నాయి.
సంయమనం పాటించండి: ఐఏఈఏ
అణు ప్లాంట్ల భద్రతపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణు కేంద్రాలు లేదా వాటి పరిసర ప్రాంతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లక్ష్యంగా చేసుకోకూడదని స్పష్టం చేశారు. "అనుబంధ భవనాల్లో కూడా కీలకమైన భద్రతా పరికరాలు ఉంటాయి. యుద్ధ సమయంలో అణు భద్రతకు సంబంధించిన నియమాలను కచ్చితంగా పాటించాలి" అని ఆయన పిలుపునిచ్చారు. భారీ అణు ప్రమాదాన్ని నివారించడానికి సైనిక దళాలు అత్యున్నత స్థాయిలో సంయమనం పాటించాలని గ్రాస్సీ కోరారు.
శాంతియే ఏకైక మార్గం
యుద్ధం రోజురోజుకూ తీవ్రమవ్వడం వల్ల ముప్పు పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. "ఈ ఉద్రిక్తతలు వెంటనే తగ్గాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి మాత్రమే సరైన మందు" అని ఆయన వ్యాఖ్యానించారు. అణు కేంద్రంపై జరిగిన ఈ దాడి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అణు ధార్మికత వెలువడితే అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
