Let's talk: editor@tmv.in
ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలెట్‌ను కాపాడాం: ట్రంప్

ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలెట్‌ను కాపాడాం: ట్రంప్

Shaik Mohammad Shaffee
6 ఏప్రిల్, 2026

పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇరాన్ దళాలు కూల్చివేసిన అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానానికి చెందిన రెండో పైలెట్‌ను యూఎస్ సైన్యం సురక్షితంగా రక్షించింది. శత్రువుల కళ్లుగప్పి, ప్రాణాలకు తెగించి మరీ ఆ వీర యోధుడిని అమెరికా కమాండోలు కాపాడారు. ఈ విజయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరిస్తూ.. "మేము అతడిని రక్షించాం! అమెరికా తన పోరాట యోధులను ఎన్నటికీ శత్రువుల చెంత వదిలిపెట్టదు" అని స్పష్టం చేశారు.

పర్వతాల్లో మెరుపు వేట

ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇరాన్‌లోని అత్యంత ప్రమాదకరమైన కొహ్గిలుయే, బోయర్-అహ్మద్ ప్రావిన్సులతో పాటు బక్తియారీ ప్రాంతాల్లోని ఎత్తైన పర్వత శ్రేణుల్లో సాగింది. విమానం కూలిన తర్వాత గాయపడిన సదరు రెండో పైలట్ పర్వతాల్లో చిక్కుకుపోయారు. ఒకవైపు ఇరాన్ దళాలు ఆయన కోసం గాలింపు ముమ్మరం చేస్తుండగా, అమెరికా కమాండర్ ఇన్ చీఫ్, రక్షణ శాఖ ఉన్నతాధికారులు 24 గంటల పాటు ఆయన లొకేషన్‌ను పర్యవేక్షిస్తూ రక్షణ ప్రణాళికను అమలు చేశారు. ఈ ఆపరేషన్ కోసం పదుల సంఖ్యలో అత్యాధునిక యుద్ధ విమానాలను అమెరికా రంగంలోకి దించింది.

గిరిజనుల కాల్పులు.. ఇరాన్ బహుమతుల ఆశ

పైలె ట్‌ను పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడంతో, స్థానిక బక్తియారీ తెగకు చెందిన సాయుధ గిరిజనులు పర్వతాల్లో రైఫిళ్లతో వేట మొదలుపెట్టారు. అమెరికాకు చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఈ గిరిజన బృందాలు కాల్పులకు దిగాయి. ఈ గిరిజనులను "సరిహద్దుల వీర సంరక్షకులు" అంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రశంసించడం గమనార్హం. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య అమెరికా తన అత్యాధునిక ఆయుధాలతో మెరుపు దాడి చేసి రెండో పైలెట్‌ను క్షేమంగా తరలించింది.

ఒకేసారి ఇద్దరు పైలెట్ల రక్షణ

నిజానికి, అంతకుముందే మొదటి పైలెట్‌ను అమెరికా రక్షించింది. అయితే రెండో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆ వార్తను రహస్యంగా ఉంచినట్లు ట్రంప్ వెల్లడించారు. "శత్రువుల భూభాగంలోకి వెళ్లి, వేర్వేరుగా ఇద్దరు పైలెట్లను సురక్షితంగా తీసుకురావడం సైనిక చరిత్రలోనే మొదటిసారి. ఈ ఆపరేషన్‌లో మన సైనికులకు ఒక్క చిన్న గాయం కూడా కాకపోవడం మన వైమానిక ఆధిపత్యానికి నిదర్శనం" అని ఆయన గర్వంగా ప్రకటించారు.

అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం: ఇరాన్

ఇరాన్ గడ్డపై కూలిపోయిన ఎఫ్-15 విమాన పైలట్‌ను రక్షించేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఘోరంగా విఫలమైందని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రెండు సి-130 రవాణా విమానాలను, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని ఇరాన్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి పేర్కొన్నారు.

ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలెట్‌ను కాపాడాం: ట్రంప్ - Tholi Paluku