
ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం అలర్ట్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేస్తూ.. ఎంబసీ ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా ఇరాన్ భూ సరిహద్దులు దాటే ప్రయత్నం చేయవద్దని కఠినంగా హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతి దాడులకు దిగుతుండటం వల్ల గల్ఫ్ ప్రాంతమంతా ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అనుమతి లేని ప్రయాణాలు వద్దు
భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా సరిహద్దులు దాటడం వల్ల తీవ్రమైన ఇమ్మిగ్రేషన్ సమస్యలు, రవాణా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ భూభాగం దాటిన తర్వాత ముందస్తు సమాచారం లేని వ్యక్తులకు ఎంబసీ నుంచి ఎటువంటి సహాయం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. "భారత రాయబార కార్యాలయం నిరంతరం భారతీయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైన చోట సమన్వయ ఏర్పాట్లు చేస్తున్నాం. పౌరులు సొంతంగా సరిహద్దుల వైపు వెళ్లడాన్ని ఏమాత్రం ప్రోత్సహించం" అని రాయబార కార్యాలయం వివరించింది.
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు
ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు తప్పనిసరిగా భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) సలహాలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబసీ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండటం మంచిదని సూచించింది. ప్రయాణాల గురించి ఏవైనా సందేహాలున్నా లేదా అత్యవసర సహాయం కావాలన్నా +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359 నంబర్లకు ఫోన్ చేయవచ్చని లేదా cons.tehrant@mea.gov.in మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన దాడుల పరంపర గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తుండటంతో భారతీయుల భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు పాటించాలని అధికారులు నొక్కి చెప్పారు.
