
ఇరాన్‌పై ఒత్తిడి.. రెండో యుద్ధ నౌకను పంపుతున్న అమెరికా
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అగ్రరాజ్యం అమెరికా తన పట్టును మరింత బిగిస్తోంది. ఇరాన్‌ను చర్చల దారికి తెచ్చేందుకు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సముద్ర మార్గంలో సైనిక ఒత్తిడిని పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ యుద్ధ నౌకకు తోడుగా, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్’ను అమెరికా అక్కడికి తరలిస్తోంది. ఈ పరిణామంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సముద్ర గర్భంలో క్షిపణి వలయం
కెరీబియన్ దీవుల నుంచి బయలుదేరిన ‘యూఎస్ఎస్ ఫోర్డ్’ తన రక్షణ నౌకలతో కలిసి పశ్చిమ ఆసియా వైపు పయనమైంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ యుద్ధ నౌకలు ఏప్రిల్ చివరి వరకు లేదా మే ఆరంభం వరకు అక్కడే మొహరించి ఉంటాయి. ఇప్పటికే రెండు వారాల క్రితమే ‘యూఎస్ఎస్ లింకన్’తో పాటు మూడు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు పర్షియన్ గల్ఫ్‌కు చేరుకున్నాయి. తాజా మోహరింపుతో ఇరాన్ చుట్టూ అమెరికా ఒక బలమైన సైనిక వలయాన్ని నిర్మిస్తోంది.
వెనిజులా నుంచి ఇరాన్ వైపు..
వాస్తవానికి ‘యూఎస్ఎస్ ఫోర్డ్’ గతేడాది జూన్‌లో యూరోప్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో భాగంగా దీనిని కెరీబియన్ ప్రాంతానికి మళ్లించారు. జనవరి 3న కారకాస్‌పై జరిగిన దాడిలో ఈ నౌకలోని యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. మార్చిలో స్వదేశానికి తిరుగు ప్రయాణం కావాల్సిన ఈ నౌకకు, ఇరాన్ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్’ గురించి..
‘ యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్' అమెరికా నౌకాదళంలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత భారీ, అధునాతన విమాన వాహక యుద్ధ నౌక. సుమారు 13 బిలియన్ డాలర్ల వ్యయంతో తయారైన ఈ అణుశక్తి నౌక, అమెరికా సైనిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది దాదాపు 1,100 అడుగుల పొడవు ఉండి, 1,00,000 టన్నుల బరువును మోయగలదు. ఈ నౌకపై ఒకేసారి 75 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను ఉంచవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే, రెండు న్యూక్లియర్ రియాక్టర్ల సహాయంతో ఇది దశాబ్దాల పాటు ఇంధనం అవసరం లేకుండా సముద్రంలో ప్రయాణించగలదు.
సాంకేతికంగా ఈ నౌకలో ఎన్నో మార్పులు చేశారు. విమానాలను గాల్లోకి పంపడానికి పాత పద్ధతికి భిన్నంగా 'ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్'ను ఇందులో వాడుతున్నారు. దీనివల్ల విమానాలు వేగంగా, సులభంగా టేకాఫ్ అవ్వగలవు. అలాగే, క్షిపణి దాడుల నుండి తన్ను తాను రక్షించుకోవడానికి అత్యాధునిక రాడార్లు, రక్షణ వ్యవస్థలు దీని సొంతం. సుమారు 4,500 మంది సిబ్బందికి వసతి కల్పించగల ఈ నౌక, సముద్రంపై కదిలే ఒక భారీ యుద్ధ క్షేత్రం వంటిది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు శత్రువులను హెచ్చరించడానికి అమెరికా దీనిని ప్రధానంగా వాడుతుంది.
‘మిడ్ నైట్ హామర్’ హెచ్చరికలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన ‘ఆపరేషన్ మిడ్ నైట్ హామర్’ దాడిని ఆయన గుర్తు చేశారు. 2025 జూన్ 21-22 తేదీల్లో అమెరికా జరిపిన ఈ మెరుపు దాడిలో ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈసారి కూడా చర్చలు ఫలించకపోతే అంతకంటే ‘ఘోరమైన’ పరిణామాలు (ట్రామాటిక్ అవుట్‌కమ్) ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ఒమన్‌లో పరోక్ష చర్చలు
ఒకవైపు యుద్ధనౌకలు మోహరిస్తుండగానే, మరోవైపు ఒమన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ఉన్నతాధికారి అలీ లారిజాని ధృవీకరించారు. అమెరికా సైనిక చర్య కంటే చర్చల మార్గమే ఉత్తమమని గుర్తించిందని, ఇది ఒక ‘విచక్షణాయుతమైన మార్గం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు అమెరికా నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రతిపాదనలు అందలేదని ఆయన స్పష్టం చేశారు.
లొంగేది లేదంటున్న ఇరాన్
అణు ఇంధన శుద్ధి విషయంలో ఇరాన్ తన పట్టు వీడటం లేదు. వైద్య రంగం, విద్యుత్ అవసరాల కోసం తమకు యూరేనియం శుద్ధి అవసరమని, దీనిని పూర్తిగా నిలిపివేసే ప్రసక్తే లేదని లారిజాని తేల్చి చెప్పారు. అమెరికా తమపై దాడికి దిగితే, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ ద్వారా హెచ్చరించారు.
ఇజ్రాయెల్ దౌత్యం.. అమెరికా వ్యూహం
ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిరంతరం అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. నెతన్యాహుతో భేటీ తర్వాత ట్రంప్ వైఖరి మరింత కఠినంగా మారడం గమనార్హం. కేవలం అణు కార్యక్రమమే కాకుండా, ఇరాన్ క్షిపణి వ్యవస్థపై కూడా ఆంక్షలు విధించాలని వాషింగ్టన్ పట్టుబడుతోంది. ఈ ఉద్రిక్తతలు చర్చల ద్వారా సమసిపోతాయా లేక మరో సైనిక ఘర్షణకు దారితీస్తాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
