Let's talk: editor@tmv.in
ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక

ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక

Shaik Mohammad Shaffee
15 జనవరి, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్‌లోని భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ భద్రతా పరిస్థితులు శరవేగంగా క్షీణిస్తుండటంతో భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని విడిచి రావాలని బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్న సంకేతాలు, దేశవ్యాప్తంగా సాగుతున్న హింసాత్మక నిరసనల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ అత్యవసర 'ట్రావెల్ అడ్వైజరీ'ని విడుదల చేసింది.

అందుబాటులో ఉన్న మార్గాల్లో వచ్చేయండి

జనవరి 5న ఇచ్చిన ప్రాథమిక హెచ్చరికలకు కొనసాగింపుగా ఎంబసీ తాజా ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు తక్షణమే వాణిజ్య విమానాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాల ద్వారా స్వదేశానికి చేరుకోవాలని స్పష్టం చేసింది. భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నిరసనలు జరిగే ప్రాంతాలకు ఏమాత్రం వెళ్లవద్దని, నిరంతరం స్థానిక వార్తలను గమనిస్తూ ఎంబసీతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది.

ఇరాన్ నిరసనల్లో 2,500 మందికి పైగా మృతి!

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో గత మూడు వారాలుగా అక్కడ నిరసనలు ఉధృతమయ్యాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి (1 డాలర్ = 14 లక్షల రియాల్స్) పడిపోవడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు సుమారు 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దశాబ్ద కాలంలో మత గురువుల పాలనకు ఇది అతిపెద్ద సవాలుగా మారింది.

ట్రంప్ హెచ్చరిక.. దాడులకు అమెరికా సిద్ధం?

ప్రజలపై అణచివేతను ఆపకపోతే ఇరాన్‌పై దాడులు తప్పవని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి. "నిరసనలు కొనసాగించండి.. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి.. మీకు సహాయం అందుతోంది" అంటూ ట్రంప్ నిరసనకారులకు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైనిక దాడులకు దిగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు.. పత్రాలు సిద్ధం

ఇరాన్‌ను వీడే లోపు భారతీయులు తమ పాస్‌పోర్ట్, వీసా, ఇతర గుర్తింపు పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని ఎంబసీ కోరింది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే ఎంబసీని సంప్రదించాలని సూచించింది. దేశాన్ని వీడే క్రమంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా దౌత్య కార్యాలయం సహాయం కోరాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రాణరక్షణకు కీలకమని స్పష్టం చేసింది.

హెల్ప్‌లైన్లు.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి

భారతీయులకు సాయం చేసేందుకు టెహ్రాన్ ఎంబసీ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఎంబసీలో పేరు నమోదు చేసుకోని వారు విదేశాంగ శాఖ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతే, భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.