Let's talk: editor@tmv.in
ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు

ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు

Shaik Mohammad Shaffee
9 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి రావాలని భారత రాయబార కార్యాలయం బుధవారం తాజా 'అడ్వైజరీ' జారీ చేసింది. ఏప్రిల్ 7న జారీ చేసిన ఆదేశాలకు కొనసాగింపుగా, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబసీ వెల్లడించింది. స్వదేశానికి రావాలనుకునే వారు ఎంబసీ సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది.

సరిహద్దుల వద్ద అప్రమత్తత

భారతీయ పౌరులు ఎంబసీ ముందస్తు అనుమతి, సంప్రదింపులు లేకుండా ఎలాంటి అంతర్జాతీయ భూ సరిహద్దుల వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దని రాయబార కార్యాలయం గట్టిగా హెచ్చరించింది. పౌరుల సహాయార్థం ప్రత్యేక మొబైల్ నంబర్లను (+989128109115, +989128109102, +989128109109, +989128109159), ఈమెయిల్ (cons.tehran@mea.gov.in) అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 7,500 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ వంటి ప్రాంతాల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్మేనియా సరిహద్దు చేరుకునేలా ప్రయాణ ప్రణాళికలు రూపొందించారు.

ట్రంప్ వెనక్కి.. 2 వారాల కాల్పుల విరమణ

మరోవైపు ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల శాంతి ప్రణాళిక 'ఆచరణ సాధ్యం'గా ఉందని భావించిన ఆయన, రెండు వారాల పాటు ఉభయ పక్షాల కాల్పుల విరమణను ప్రకటించారు. దీంతో 40 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఈ విరామ సమయాన్ని వినియోగించుకుని భారతీయులను సురక్షితంగా తరలించాలని కేంద్రం భావిస్తోంది. గత 48 గంటలుగా అమల్లో ఉన్న 'స్టే ఎట్ హోమ్' ఆదేశాలను సవరిస్తూ ఇప్పుడు ప్రయాణాలకు అనుమతించినప్పటికీ, హైవేలపై కదలికలను ఎంబసీకి సమాచారం ఇవ్వాలని సూచించింది.

ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు

యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగడంతో ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. నిబంధనల ప్రకారం హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక శాంతి స్థాపన కోసం అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య ఈ శుక్రవారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల ఫలితం పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనుంది. అయితే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని తరుణంలో విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని, భద్రతా నియమాలను పాటించాలని ఎంబసీ తన పౌరులకు విజ్ఞప్తి చేసింది.

ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు - Tholi Paluku