
ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు: ట్రంప్
ప్రపంచ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన పట్టును ప్రదర్శించింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను ఆర్థికంగా ఏకాకిని చేసే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 25 శాతం అదనపు సుంకం చెల్లించాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
"ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపై 25 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వు అంతిమమైనది" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు.
భారత్, చైనా, యూఏఈలపై తీవ్ర ప్రభావం
ట్రంప్ తాజా నిర్ణయం ఇరాన్‌తో ప్రధానంగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇరాన్‌కు కీలక వాణిజ్య భాగస్వాములుగా చైనా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, పాకిస్తాన్, ఆర్మేనియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ ముఖ్యమైన స్థానంలో ఉంది.
భారత్‌పై ఇప్పటికే 50 శాతం సుంకాల భారం
ఇప్పటికే అమెరికా భారత్‌పై 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తోంది. ఇందులో 25 శాతం సుంకం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించగా, మిగతా 25 శాతం ఇతర వాణిజ్య అంశాలకు సంబంధించినవని వాషింగ్టన్ వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్ యుద్ధానికి తోడ్పడుతున్నాయనే ఆరోపణలతో ఈ సుంకాలు విధించినట్లు అమెరికా చెబుతోంది.
భారత్–ఇరాన్ వాణిజ్య సంబంధాలు
భారత్–ఇరాన్ మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్‌కు భారత్ ఐదు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా కొనసాగుతోంది. భారత్ నుంచి ఇరాన్‌కు బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, కృత్రిమ ఆభరణాలు ప్రధానంగా ఎగుమతవుతుండగా, ఇరాన్ నుంచి భారత్‌కు డ్రై ఫ్రూట్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్, గాజు ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.
ఆర్థిక గణాంకాల ప్రకారం 2023లో భారత్ నుంచి ఇరాన్‌కు 1.19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగగా, ఇరాన్ నుంచి భారత్‌కు 1.02 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. ఇందులో భారత్ నుంచి ఇరాన్‌కు బియ్యం ఎగుమతులు 734 మిలియన్ డాలర్లుగా ఉండగా, సోయాబీన్ మీల్ 96.8 మిలియన్ డాలర్లు, అరటిపండ్లు 52 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇరాన్ నుంచి భారత్‌కు ప్రధానంగా హాలోజనేటెడ్ ఆల్కహాల్ డెరివేటివ్స్ వంటి రసాయనాలు దిగుమతి అవుతున్నాయి.
చబహార్ పోర్ట్‌పై ప్రభావం?
భారత్–ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో చబహార్ పోర్ట్ ఒక కీలక వ్యూహాత్మక ప్రాజెక్ట్‌గా కొనసాగుతోంది. 2015లో చబహార్ పోర్ట్ అభివృద్ధిపై భారత్, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 2016లో భారత్–ఇరాన్–అఫ్గానిస్థాన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరి అంతర్జాతీయ రవాణా మార్గానికి పునాది పడింది. 2018లో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా భారత్ పోర్ట్ నిర్వహణ ప్రారంభించగా, 2024లో షహీద్ బెహిష్టీ టెర్మినల్ నిర్వహణకు సంబంధించి 10 ఏళ్ల ఒప్పందం కుదిరింది. తాజా అమెరికా నిర్ణయం ఈ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్‌కు రిపబ్లికన్ మద్దతు
ట్రంప్ నిర్ణయానికి అమెరికాలో రిపబ్లికన్ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సెనేటర్ లిండ్సే గ్రాహం ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఒంటరిగా చేయడంలో ఆయన నాయకత్వం అద్భుతమని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడవద్దని ఆయన సూచించారు.
నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్
ఇదే సమయంలో ఇరాన్‌లో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక కష్టాలు, పాలనపై అసంతృప్తి కారణంగా చెలరేగిన ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 544 మంది మరణించగా, 10,681 మందిని అరెస్టు చేసినట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.
చర్చలకు ఇరాన్ ప్రయత్నం
ఈ పరిణామాల మధ్య ఇరాన్ నాయకత్వం అమెరికాతో చర్చలకు సిద్ధమని ట్రంప్ వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇరాన్ మాతో చర్చలు కోరుతోంది. వారు అలసిపోయారు” అని ఆయన అన్నారు. అయితే ఇరాన్‌లో పరిస్థితులు మరింత దిగజారితే అమెరికా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
మొత్తంగా ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు ఇది ఆర్థికంగానే కాదు, వ్యూహాత్మకంగానూ పెద్ద సవాలుగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
