Let's talk: editor@tmv.in
ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం కీలక సూచన

ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం కీలక సూచన

Shaik Mohammad Shaffee
19 నవంబర్, 2025

భారతీయ పౌరులు తమ దేశంలోకి వీసా లేకుండా ప్రవేశించేందుకు కల్పించిన సదుపాయాన్ని ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వీసా రహిత ప్రవేశాన్ని నవంబర్ 22, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం సాధారణ పాస్‌పోర్టులు కలిగిన భారతీయ పౌరులందరికీ వర్తిస్తుంది. ఇకపై భారతీయులు ఇరాన్‌లోకి ప్రవేశించాలన్నా లేదా ఆ దేశం మీదుగా ప్రయాణించాలన్నా తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది.

సదుపాయం రద్దుకు కారణాలు

ఇటీవల కాలంలో భారతీయ పౌరులు ఎక్కువగా మోసపోవడం, ముఖ్యంగా ఈ వీసా రహిత సదుపాయాన్ని నేరగాళ్లు దుర్వినియోగం చేస్తూ వారిని మానవ అక్రమ రవాణా కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇరాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

“కొందరు ఏజెంట్లు ఉన్నత వేతనాల ఉద్యోగాల హామీలతో భారతీయ పౌరులను ఇతర దేశాలకు పంపిస్తానని చెబుతూ, వీసా-రహిత సదుపాయాన్ని ఉపయోగించుకుని ముందుగా ఇరాన్‌కు పంపిస్తున్నారు. ఇరాన్‌కు చేరుకున్న అనేక మంది భారతీయులు అక్కడ నేరగాళ్ల ముఠాల చేతిలో కిడ్నాప్‌లకు గురై, వారి కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నారు” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ మానవ అక్రమ రవాణా బాధితులుగా మారుతున్న భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ సదుపాయం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇరాన్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 2023లో ఇరాన్ భారతీయ పర్యాటకులు 15 రోజులపాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

భారత విదేశాంగ శాఖ* *కీలక ప్రయాణ* *సూచన

ఇరాన్ నిర్ణయం, పెరుగుతున్న మోసాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ హైఅలర్ట్ జారీ చేసింది. ఇరాన్‌కు వెళ్లాలని భావించే భారతీయ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. వీసా రహిత ప్రయాణాన్ని ఆఫర్ చేసే లేదా ఇరాన్ మీదుగా మూడవ దేశాలకు పంపుతామని హామీ ఇచ్చే ఏజెంట్లను నమ్మవద్దని కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి ఏజెంట్లు క్రిమినల్ ముఠాలతో కుమ్మక్కై ఉండవచ్చని, కాబట్టి వారి ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది.

నవంబర్ 22 తేదీ నుంచి సాధారణ పాస్‌పోర్టులు కలిగిన వారంతా తప్పనిసరిగా దౌత్య కార్యాలయాల ద్వారా వీసా పొందిన తర్వాతే ఇరాన్‌కు వెళ్లాలని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ చర్య విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే భారతీయులందరూ అక్రమ ఏజెంట్లను నమ్మకుండా, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ప్రయాణించాలని గట్టిగా హెచ్చరిస్తోంది.