Let's talk: editor@tmv.in
ఇరాన్‌కు ట్రంప్‌ ‘శాంతి’ అస్త్రం.. 15 అంశాలతో సంధి ప్రతిపాదన!

ఇరాన్‌కు ట్రంప్‌ ‘శాంతి’ అస్త్రం.. 15 అంశాలతో సంధి ప్రతిపాదన!

Shaik Mohammad Shaffee
26 మార్చి, 2026

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికేందుకు 15 అంశాలతో కూడిన 'సీజ్‌ఫైర్' (సంధి) ప్రణాళికను ప్రతిపాదించారు. పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనలను ఇప్పటికే టెహ్రాన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది.

ఇరాన్ ముందుంచిన 11 కఠిన షరతులు

• ఇరాన్ తన వద్ద ఉన్న ప్రస్తుత అణు సాంకేతికతను పూర్తిగా వదిలివేయాలి.

• భవిష్యత్తులో ఎన్నడూ అణు ఆయుధాలను తయారు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.

• సొంత భూభాగంపై యురేనియం శుద్ధి పనులను పూర్తిగా ఆపేయాలి.

• ప్రస్తుతం ఉన్న సుమారు 450 కిలోల యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కు అప్పగించాలి.

• నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో వంటి కీలక అణు కేంద్రాలను పూర్తిగా తొలగించాలి.

• ఐఏఈఏ అధికారులకు దేశంలో ఎక్కడైనా తనిఖీ చేసేందుకు పూర్తి అనుమతి ఇవ్వాలి.

• మధ్యప్రాచ్యంలో ఉన్న ఇతర సాయుధ ముఠాలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలి.

• పొరుగు దేశాల్లోని అల్లరి మూకలకు నిధులు, ఆయుధాలు ఇవ్వడం ఆపేయాలి.

• అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఈ జలసంధిని ఎప్పుడూ తెరిచే ఉంచాలి.

• క్షిపణుల సంఖ్య, అవి ప్రయాణించే దూరంపై పరిమితులు విధించుకోవాలి.

• క్షిపణులను కేవలం తమ దేశ రక్షణ కోసమే వాడాలి.

బదులుగా ఇరాన్‌కు అందే 4 ప్రయోజనాలు

• ఇరాన్‌పై ఉన్న అన్ని ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను పూర్తిగా తొలగిస్తారు.

• విద్యుత్ ఉత్పత్తి వంటి శాంతియుత అవసరాల కోసం అణు సాంకేతికతలో అమెరికా సహాయం చేస్తుంది.

• బూషెహర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అందిస్తారు.

• నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ ఆటోమేటిక్‌గా ఆంక్షలు పడే 'స్నాప్‌బ్యాక్' నిబంధనను తొలగిస్తారు.

ఒకవైపు రాయబారం.. మరోవైపు రణరంగం

ఒకపక్క శాంతి చర్చల మాట వినిపిస్తున్నా, అమెరికా రక్షణ శాఖ తన సైనిక బలగాలను యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. వెయ్యి మంది పారాచూట్ సైనికులను, 5 వేల మంది ప్రత్యేక మెరైన్ బలగాలను ఈ ప్రాంతానికి పంపుతోంది. ఇరాన్ చమురు వ్యాపారానికి కీలకమైన 'ఖర్గ్ ద్వీపాన్ని' తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ మోహరింపు జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూసివేతతో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల మార్కును దాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తోంది.

ఇరాన్ దాదాపు ఓడిపోయింది: ట్రంప్

ఈ పరిణామాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇరాన్ సైన్యం దాదాపు కుప్పకూలింది. వారి నౌకాదళం, వాయుసేన అన్నీ ధ్వంసమయ్యాయి. సైనికంగా వారు ఇప్పుడు మృతులతో సమానం. మేము గెలిచాం, అందుకే వారు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.

సార్వభౌమత్వమే ముఖ్యం: ఇరాన్

ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. ప్రతిపాదనలను పరిశీలిస్తాం కానీ, తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించే షరతులను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆపితేనే శాంతి సాధ్యమని, విజయం సాధించే వరకు పోరాడతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు.

ఇరాన్‌కు ట్రంప్‌ ‘శాంతి’ అస్త్రం.. 15 అంశాలతో సంధి ప్రతిపాదన! - Tholi Paluku