Let's talk: editor@tmv.in
ఇరాక్ రాయబారికి సౌదీ సమన్లు.. డ్రోన్ దాడులపై తీవ్ర ఆగ్రహం

ఇరాక్ రాయబారికి సౌదీ సమన్లు.. డ్రోన్ దాడులపై తీవ్ర ఆగ్రహం

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, సౌదీ అరేబియా తన భూభాగంపై జరుగుతున్న వరుస దాడులపై ఇరాక్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇరాక్ భూభాగం నుంచి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలపై డ్రోన్ల ద్వారా నిరంతరం దాడులు జరుగుతుండటంపై రియాద్ ఆదివారం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని ఇరాక్ రాయబారి సఫియా అల్-సుహైల్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.

సౌభౌమాధికారమే కీలకం

సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆదేశాల మేరకు, రాజకీయ వ్యవహారాల ఉపమంత్రి డాక్టర్ సౌద్ అల్-సతీ.. ఇరాక్ రాయబారిని కలిసి అధికారికంగా నిరసన పత్రాన్ని అందజేశారు. ఇరాక్ భూభాగం నుంచి జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాల సార్వభౌమత్వానికి భంగం కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, తమ ప్రాంతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా హెచ్చరించింది. తన భూభాగం నుంచి దాడులు జరగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ఇరాక్ ప్రభుత్వానిదేనని సౌదీ స్పష్టం చేసింది.

ఇరాన్ పట్టు తప్పుతోందా?

ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో వ్యూహాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సిరియా, లెబనాన్, ఇరాక్ దేశాల్లో బలంగా ఉన్న ఇరాన్ పట్టు ప్రస్తుతం సడలుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక జలసందులను ఆయుధంగా మలచుకుని ప్రాంతీయ భద్రతపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ భూభాగం నుంచి జరుగుతున్న ఈ డ్రోన్ దాడులు కూడా ఆ ఒత్తిడిలో భాగమేనని అంచనా వేస్తున్నారు.

ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ పునరుద్ధరణ వేగవంతం

ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, తమ దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రపంచ చమురు మార్కెట్‌పై దాని ప్రభావం పడకుండా సౌదీ అరేబియా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. తమ కీలకమైన 'ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్'ను పూర్తిస్థాయి సామర్థ్యానికి (రోజుకు సుమారు 70 లక్షల బ్యారెళ్ల చమురు) పునరుద్ధరించినట్లు వెల్లడించింది. దీంతో పాటు తూర్పు తీరంలోని 'మనీఫా' చమురు కేంద్రాన్ని కూడా తిరిగి ప్రారంభించారు. దీని ద్వారా రోజుకు సుమారు 3 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి కానుంది. రక్షణ, ఇంధన రంగాల్లో తమ పట్టును చాటుకుంటూనే, పొరుగు దేశాల నుంచి వస్తున్న ముప్పులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధమైంది.