
ఇరాక్‌లో అమెరికా సైనిక విమానం కూలి ఆరుగురి మృతి
ఇరాక్ గగనతలంలో అమెరికాకు చెందిన భారీ ఇంధన ట్యాంకర్ విమానం కూలిపోయిన ఘటనలో ఆరుగురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర ప్రమాదాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా, ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
గాలిలో విమానాల ఢీ.. సాంకేతిక లోపమే కారణమా?
ఈ ప్రమాదం శత్రువుల దాడి వల్ల గానీ, పొరపాటున జరిగిన కాల్పుల వల్ల గానీ జరగలేదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. గాలిలో యుద్ధ విమానాలకు ఇంధనం నింపుతున్న (రీఫ్యూయలింగ్) సమయంలో రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొనడం వల్లే ఈ ఘోరం జరిగిందని సమాచారం. ప్రమాదానికి గురైన 'బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్' పశ్చిమ ఇరాక్‌లో కూలిపోగా, దెబ్బతిన్న మరో విమానం సురక్షితంగా ఇజ్రాయెల్‌లో ల్యాండ్ అయింది. ఈ ఘటనపై పెంటగాన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల వివరాలను వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న ఇరాన్ మీడియా
కాగా ఈ ప్రమాదాన్ని తమ విజయంగా చిత్రీకరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. పశ్చిమ ఇరాక్‌లోని తమ మద్దతుదారులైన 'రెసిస్టెన్స్ గ్రూపులు' అమెరికా విమానాన్ని క్షిపణితో కూల్చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచారం చేస్తోంది. విమానంలో ఉన్న ఆరుగురు చనిపోయారని, విమానం యుద్ధ విమానానికి ఇంధనం నింపుతుండగా తాము టార్గెట్ చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే అమెరికా అధికారులు ఈ వాదనలను కొట్టిపారేశారు. విమానం కూలింది స్నేహపూర్వక గగనతలంలోనేనని, శత్రువుల దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
