Let's talk: editor@tmv.in
ఇరవై సంవత్సరాలుగా ప్రజలను దోపిడీ చేశారు: తేజశ్వి యాదవ్

ఇరవై సంవత్సరాలుగా ప్రజలను దోపిడీ చేశారు: తేజశ్వి యాదవ్

Pinjari Chand
25 అక్టోబర్, 2025

ఇరవై సంవత్సరాలుగా బీహార్ ప్రజలను డబుల్ ఇంజిన్ సర్కార్ దోపిడీ చేసిందని రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజశ్వీ యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఎన్నికల సభలో మాట్లాడుతూ నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తోందని తెలిపారు. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంతో సంతోషంగా లేరన్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుతున్నారు. వారు ప్రస్తుత ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సారి ప్రజలు ప్రతీకారం చూపుతారని ఆయన పేర్కొన్నారు.

తేజశ్వీ సాహర్సా లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. మోడీ గుజరాత్‌లో ఫ్యాక్టరీలు పెట్టి, బీహార్‌లో గెలిపించాలని కోరుతున్నారు.మోడీ, అమిత్ షాను ఉద్దేశించి గుజరాత్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బీహార్ ను పాలించాలని అనుకుంటున్నారు. మనం పాలించుకోలేమా? బీహరీని బీహార్‌‌ పరిపాలించాలా? లేక బహరీనా(బయటివాడా) అని ప్రశ్నించారు. లాలూజీ మోడీకి

భయపడలేదు, ఆయన కుమారుడు ఈడీ,సీబీఐ,ఇన్ కం ట్యాక్స్ కేసులు, రైడ్లకు భయపడతారా? అన్నారు.

నితీశ్ కుమార్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం 20 సంవత్సరాల్లో చేయలేని పనులు మహాఘట్బంధన్ 20 నెలల్లో చేసి చూపిస్తుందన్నారు. ఎన్డీయే లో సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. బీజేపీ నితీశ్ కుమార్ ను సీఎంగా మళ్లీ చేయలనుకోవడం లేదు. నితీశ్ కి అన్యాయం చేస్తోంది అని ఆయన అన్నారు. తేజశ్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) నాయకుడు ముకేష్ సహానిని డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. అలాగే ఇతర వర్గాల నాయకులకు కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇరవై సంవత్సరాలుగా ప్రజలను దోపిడీ చేశారు: తేజశ్వి యాదవ్ - Tholi Paluku