
ఇరుపార్టీల వైరంలో నలుగుతున్న బీజేపీ
తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలన్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. కనీసం పొత్తుల్లో భాగంగా అయినా ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిద్దామనుకుంటే కావడం లేదు. గతంలో అన్నాడీఎంకే, డీఎంకేతో పొత్తులు కలుపుకున్నప్పటికి బీజేపీకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు. 2021 ఎన్నికల్లో ప్రయత్నించినా చివరి క్షణంలో అన్నాడీఎంకే బయటికి రావడంతో ఆశలు గల్లంతయ్యాయి. డీఎంకే ఘన విజయం సాధించింది. మళ్లీ లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఎన్నికల్లో ఫలితాలు రాబట్టలేదు. అయితే ఈసారి ఎన్నికలకు చాలా సమయం ఉండగానే పొత్తులపై ప్రకటనలు జరిగాయి. అన్నాడీఎంకేతో పాటు శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ స్థాపించిన మక్కల్ ముంద్రా కజగం (ఏఎంఎంకే) కూడా జతకట్టింది. అన్నాడీఎంకే నాయకుడు, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి నచ్చని అన్నామలైని తప్పించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాయనర్ నాగేంద్రకు పదవీ బాధ్యతలు అప్పగించింది. అంతా బాగానే ఉంది, కానీ ఎన్డీయే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళని స్వామిని ప్రకటించిందో అప్పుడే మాజీ సీఎం ఓపీఎస్, దినకరన్ ఎన్డీయేకు దూరమవుతూ వచ్చారు. దీంతో ఈసారి కూడా ఆశలు గల్లంతవుతాయా ఎట్లా అనే పరిస్థితిలో బీజేపీ ఉంది. ఇరువురి మధ్య ఉన్న వైరం బీజేపీ నష్టం తెచ్చేలానే కనబడుతోంది.
ఎడప్పాడిని ఒప్పుకోం
ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడిని అంగీకరించేది లేదని టీటీవీ దినకరన్ కుండబద్దలు కొట్టారు. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై దినకరన్‌తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని విజ్ఞప్తి చేశారు. కానీ అందుకనుగుణంగా ఆయన స్పందిచలేదు. ఎడప్పాడి సీఎం అభ్యర్థిగా ఉన్నంత కాలం ఎన్డీయేలో చేరబోమని ప్రకటించారు. దాదాపు అసాధ్యం అని తేల్చేశారు. ఆయన బాటలో మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం కూడా నడుస్తున్నారు. దినకరన్ ఏదైతే చెప్పారో మేం కూడా అదే పాటిస్తామని అన్నారు. ఇటీవల ఎడప్పాడి అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామని మేం అంగీకరించలేం అని తేల్చిచెప్పారు.
ఎందుకీ వైరం
అన్నాడీఎంకేకు, ఎఎంఎంకేకు మధ్య వైరం 2021 కంటే ముందు అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఉండగా ఏర్పడింది. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్)కి గతంలో జయలలిత మరణం తరువాత శశికళ జైలుకు వెళ్లేకంటే ముందు ఈపీఎస్‌ను సీఎంగా చేసింది. అయితే దీన్ని వ్యతిరేకించిన ఓపీఎస్ వర్గం బయటకు వెళ్లిపోయింది. అయితే శాసనసభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి ఎమ్మెల్యేల బలం అవసరం వచ్చింది. దీంతో దినకరన్ వర్గానికి చెందిన దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్‌కు మద్దతివ్వడంతో విశ్వాస పరీక్షలో నెగ్గి సీఎంగా కొనసాగారు.
ప్రభుత్వంలో అలజడి రేగకుండా దినకరన్ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉండటానికి సమ్మతి తెలిపారు. అందుకు ఈపీఎస్‌తో కలిసి పనిచేశారు. అయితే ఈపీఎస్ సీఎంగా కుదురుకున్నాక అన్నాడీఎంకేలో ఉన్న దినకరన్ వర్గాన్ని ఎదగనీయకుండా చేశారు. అలాగే తన వర్గంలోని నాయకులు అటువైపు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో దినకరన్‌కు ఈపీఎస్ పొమ్మనలేక పొగబెట్టారు. దినకరన్ వర్గం ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండా అణదొక్కే ప్రయత్నం చేసిందన్నది దినకరన్ వర్గం వాదన. బయటకు వచ్చేసి ఎఎంఎంకే పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్న తనను సంప్రదించకుండా ఈపీఎస్‌ను ఏ విధంగా సీఎం అభ్యర్థిగా ఖరారు చేస్తారు. మేం పళనిస్వామి చేసి ద్రోహాన్ని మరువలేం, మేం ఎప్పటికీ ఆయనను క్షమించలేం అని గుర్తు చేశారు. అందువల్ల దినకరన్ అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడం ఉపసంహరించుకున్నారు. దాంతో పాటు కేంద్ర హోంమంత్రి ఆయనను ఎన్డీయే తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు కదా అని తెలిపారు.
భవిష్యత్‌లో డీఎంకేతో కూడా కలవవచ్చు
భవిష్యత్‌లో ఏఎంఎంకే ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎడప్పాడి పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. వారు ఏ ఆశయ సాధన కోసం, దేన్ని కాంక్షించి పార్టీ స్థాపించారో నేడు ఆ ఆశయాలు లేవని విమర్శించారు. అందుకే మహనీయుల లక్ష్యాలను చేరుకునే విధంగా మేం ప్రయత్నిస్తామని టీటీవీ దినకరన్ అన్నారు. అలాగే 2026 ఎన్నికల తర్వాత లేదా అంతకంటే ముందుగా కూడా డీఎంకేతో కూడా కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. మంచి పరిణామాలు జరగొచ్చు అని హింట్ ఇచ్చారు.
అయితే ఈపీఎస్‌కు పళనిస్వామికి, టీటీవీ దినకరన్‌కు మధ్య ఉన్న విబేధాల వలన బీజేపీ నలిగిపోతుంది. ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదర్చలేక వేగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2026లో జరిగే ఎన్నికల్లో ఎన్డీయే ఎటువైపు వెళుతుందో, వారితో ఎవరెవరు కలిసివస్తారన్నది వేచి చూడాల్సిందే.
