
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు: సోదరి ఉజ్మా ఖాన్
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి దాదాపు నెల రోజులుగా నెలకొన్న వదంతులకు తెరపడింది. ఎట్టకేలకు మంగళవారం నాడు ఆయన సోదరి డా. ఉజ్మా ఖాన్‌కు రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి లభించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉందని ఆమె తెలిపారు. అయితే ఆయనను ఒంటరి నిర్బంధంలో ఉంచి మానసిక హింసకు గురిచేస్తున్నారని ఇమ్రాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. తాను ఆరోగ్యంగా ఉన్నా, అధికారులు తనను రోజంతా సెల్‌లోనే ఉంచుతూ, కేవలం కొద్దిసేపు మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తున్నారని, అలాగే ఎవరితోనూ మాట్లాడకుండా అడ్డుకుంటూ మానసికంగా వేధిస్తున్నారని ఇమ్రాన్ చెప్పినట్లు డా. ఉజ్మా ఖాన్ తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ గత ఆగస్టు 2023 నుండి పలు కేసుల్లో జైలులో ఉన్నారు. నెల రోజులకు పైగా ఆయనను కలవడానికి కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అడియాలా జైలు వెలుపల గుమిగూడి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఒత్తిడి కారణంగానే డా.ఉజ్మా ఖాన్‌కు ఆయనను కలిసేందుకు అనుమతి లభించిందని పీటీఐ ప్రకటించింది.
నిరసనకారుల ఆందోళనలను అడ్డుకోవడానికి స్థానిక ప్రభుత్వం అడియాలా రోడ్డు వెంబడి మొత్తం రావల్పిండి పోలీసు బలగాలను మోహరించింది. అంతేకాకుండా రావల్పిండి, ఇస్లామాబాద్‌లలో సెక్షన్ 144 (నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం) విధించారు. సుమారు ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేయడంతో పాటు, స్థానికులు ఐడీ కార్డు చూపితేనే ఆ ప్రాంతం గుండా వెళ్లడానికి అనుమతించారు.
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిమ్ ఖాన్ సైతం తమ తండ్రి ప్రాణాలతో ఉన్నట్లు రుజువు చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ సోదరీమణులు కూడా తీవ్రంగా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో ఏదైనా జరిగితే, అందుకు బాధ్యులైన వారిని, వారి కుటుంబాలను దేశంలోని, విదేశాల్లోని పాకిస్తానీయులు వదిలిపెట్టరని గట్టిగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని పీటీఐ పార్టీ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
