Let's talk: editor@tmv.in
ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలి: పాక్ ప్రభుత్వానికి అజారుద్దీన్‌ విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలి: పాక్ ప్రభుత్వానికి అజారుద్దీన్‌ విజ్ఞప్తి

Gaddamidi Naveen
19 ఫిబ్రవరి, 2026

పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్‌ను గౌరవప్రదంగా చూడాలని, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మహమ్మద్ అజారుద్దీన్ తన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వినడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. క్రికెట్ మైదానంలో కలిసి అనేక అనుభవాలు పంచుకున్నామని, ఒక క్రీడాకారుడిగా ఆయనకు గౌరవంతో వ్యవహరించాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని, ఆయన కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా మొత్తం 14 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు సంయుక్తంగా ఒక లేఖ రాసి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లేఖపై మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రియర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గవర్, కిమ్ హ్యూస్, నాసర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ తదితరులు సంతకం చేశారు.

వారి ప్రకటనలో, ప్రపంచ క్రికెట్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన మాజీ కెప్టెన్‌గా ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యసేవలు, మానవీయ పరిస్థితులు కల్పించాలని కోరారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య సహాయం అందకపోవడం వల్ల ఆయన కుడి కంటి చూపు 85 శాతం తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. జైలులో ఆయనకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మానవీయమైన వసతులు కల్పించాలని కెప్టెన్లు కోరారు.

1992 ప్రపంచకప్‌ను పాకిస్థాన్‌కు అందించిన, పాకిస్థాన్ మాజీ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు 2023లో అవినీతి కేసులో దోషిగా తేలి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. రాజకీయాలకు అతీతంగా ఒక క్రీడా దిగ్గజంగా ఆయనకు దక్కాల్సిన కనీస హక్కులను కాపాడాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.