
ఇప్పటి ఉద్యోగాలకే కాదు.. రేపటి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి:జీ20లో ప్రధాని మోడీ
జీ20 సదస్సులో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్ అవసరాన్ని ఉద్ఘాటించారు. అన్ని దేశాలు కలిసి నైపుణ్యవంతులైన మానవ వనరుల మార్పిడి కోసం ఒక సాధారణ వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇప్పటి ఉద్యోగాలకే కాకుండా, రేపటి సామర్థ్యాలను నిర్మించే దిశగా ప్రయాణించాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో న్యూడిల్లీలో జరిగిన జీ20లో టాలెంట్ మొబిలిటిపై మొదలైన చర్చలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఏఐపై భారత కోణం
భారతదేశ ఏఐ విధానం మూడు ప్రధాన బలాలపై ఆధారమై ఉందని ప్రధాని తెలిపారు. అందులో మొదటిది అందరికీ టెక్నాలజీ అందాలి. పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి జరగాలి. ఏఐను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. భారతదేశం నిర్మిస్తున్న ఇండియా ఏఐ మిషన్ కింద ఉన్నత స్థాయి కంప్యూటింగ్‌ను అందరికీ చేరేలా చేస్తున్నామని చెప్పారు.
ఏఐ వినియోగం పారదర్శకత, మానవ పర్యవేక్షణ, డిజైన్ రక్షణ, దుర్వినియోగ నిరోధం వంటి సూత్రాలపై ఆధారపడే గ్లోబల్ కాంపాక్ట్ అవసరమని మోడీ సూచించారు.
భారత్ నిలబడేది స్థిరమైన అభివృద్ధి కోసం. నమ్మకమైన వాణిజ్యం కోసం. న్యాయమైన ఫైనాన్స్ కోసం. అందరూ అభివృద్ధి చెందే ప్రపంచం కోసం అని మోడీ సందేశాన్ని వెల్లడించారు.
ఏఐ సమ్మిట్ కు ఆహ్వానం
2026 ఫిబ్రవరిలో జరగనున్న ఏఐ సమ్మిట్ కి (సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ) అన్న థీమ్‌తో అన్ని జీ20 దేశాలను రావాలని మోడీ ఈ సందర్భం ఆహ్వానించారు. అలాగే అందరికీ న్యాయమైన, నిష్పక్షపాత భవిష్యత్తు అన్న అంశంపై జరిగిన చర్చల్లో మోడీ కీలక సూచనలు చేశారు. క్రిటికల్ టెక్నాలజీలు మానవ కేంద్రంగా ఉండాలి, డబ్బు కేంద్రంగా కాదు. టెక్నాలజీ జాతీయత కంటే గ్లోబల్ లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓపెన్ సోర్స్ విధానాలు విస్తరించాలని, భారత్ స్పేస్, ఏఐ, డిజిటల్ పేమెంట్స్‌లో సాధించిన ప్రపంచ స్థాయి విజయాలు ఈ విధానాల ఫలితమేనని ఆయన గుర్తుచేశారు.
పన్ను సార్వభౌమత్వం కాపాడుతాం – జోహన్నెస్‌బర్గ్ డిక్లరేషన్
గ్లోబల్ మినిమమ్ ట్యాక్స్, డిజిటలైజేషన్ వల్ల ఉత్పన్నమవుతున్న అంతర్జాతీయ పన్ను సవాళ్లను ఎదుర్కోవడంలో సానుకూల చర్చలు కొనసాగిస్తామని జీ20 దేశాల నాయకులు అంగీకరించారు. దక్షిణ ఆఫ్రికాలో ముగిసిన జీ20 సదస్సు అనంతరం విడుదల చేసిన డిక్లరేషన్‌లో ఇది స్పష్టమైంది.
15శాతం గ్లోబల్ మినిమమ్ ట్యాక్స్‌పై నిర్మాణాత్మక చర్చలు
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రతిపాదించిన పిల్లర్-2 గ్లోబల్ మినిమమ్ ట్యాక్స్ (15శాతం కనీస కార్పొరేట్ పన్ను)పై అన్ని దేశాలకు అంగీకారమైన, సమతులిత పరిష్కారం త్వరితగతిన కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్టు జీ20 నేతలు ప్రకటించారు. అయితే అమెరికా ఇందులో భాగస్వామ్యం కాకపోవడం అనేక దేశాల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయని డిక్లరేషన్‌లో పరోక్షంగా సూచించారు. డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఇచ్చిన మెమోరాండంలో ‘గ్లోబల్ ట్యాక్స్ డీల్‌కు అమెరికాలో చట్టబద్ధత లేదు’ అని స్పష్టం చేయడంతో, అమెరికా లేకుండా ఈ ఒప్పందం ఎంతవరకు ప్రయోజనకరమనే అంశంపై దేశాలు ఆలోచిస్తున్నాయి.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లపై సంయుక్త చర్యలు
అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో స్థిరత్వం కోసం డిజిటలైజేషన్ కారణంగా ఉత్పన్నమవుతున్న పన్ను సవాళ్లపై కర్తవ్య పూర్వక సంభాషణ అవసరమని జీ20 నేతలు వ్యాఖ్యానించారు. గ్లోబల్ లెవల్‌లో సమాన పోటీ పరిస్థితులను దెబ్బతీసే ప్రమాదాలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించారు.
పన్ను సార్వభౌమత్వం కాపాడుతాం
ఈ చర్యలన్నీ ఓఈసీడీ/జీ20 ఇన్క్లూసివ్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో చేపట్టాలని, అలాగే ప్రతి దేశం యొక్క పన్ను సార్వభౌమత్వాన్ని కాపాడటం అత్యవసరం అని డిక్లరేషన్‌లో స్పష్టం చేశారు.
పారదర్శకత కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్
జీ20 దేశాలు స్వచ్ఛందంగా అనుసరించగలిగే విధంగా, స్థిరాస్తులపై అంతర్జాతీయ పన్ను పారదర్శకతను పెంచేందుకు కొత్త ఓఈసీడీ ఫ్రేమ్‌వర్క్ అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. ఇది బేస్ ఇరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ (బీఈపీఎస్) ప్రాజెక్ట్‌ను మరింత బలపరుస్తుందన్నారు.
అభివృద్ధి కోసం అత్యుత్తమ వనరు దేశీయ ఆదాయమేనని, పన్ను సంస్కరణలు దేశానికే చెందినవి, దేశం ముందుండి నడిపేవి ఉండాలి అని జీ20 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
