
ఇన్‌స్టాలో ప్రధాని మోడీకి వంద మిలియన్ ఫాలోవర్లు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ (10 కోట్ల) ఫాలోవర్ల మైలురాయిని దాటారు. ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచ నాయకుడు, రాజకీయ నాయకుడిగా ఆయన నిలిచారని అధికారులు గురువారం తెలిపారు. 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన మోడీ ఖాతా, గత దశాబ్దంలో ప్రపంచ నేతలలో అత్యంత చురుకైన డిజిటల్ వేదికలలో ఒకటిగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రధాన నేతలలో ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేత మోడీనే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంటే రెండింతలకు పైగా ఫాలోవర్లు మోడీకి ఉన్నారు. ట్రంప్ ప్రస్తుతం సుమారు 43.2 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు.
ఇతర ప్రపంచ నేతలలో
• ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియంటో– 15 మిలియన్
• బ్రెజిల్ అధ్యక్షుడు లుయీజ్ ఇనాసివో లులా డ సిల్వా – 14.4 మిలియన్
• టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ – 11.6 మిలియన్
• అర్జెంటీనా అధ్యక్షుడు జేవీయర్ మిలేయి – 6.4 మిలియన్
ఈ ఐదుగురు ప్రపంచ నేతల ఫాలోవర్ల మొత్తం సంఖ్య కూడా మోడీ వ్యక్తిగత ఫాలోవర్ల కంటే తక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
భారతదేశంలో కూడా మోడీ ఇతర రాజకీయ నాయకుల కంటే చాలా ముందంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమారు 16.1 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుమారు 12.6 మిలియన్ ఫాలోవర్లతో తరువాతి స్థానంలో ఉన్నారు. ఈ గణాంకాలు ప్రపంచ యువతలో మోడీకి ఉన్న డిజిటల్ ప్రభావం, ప్రజాదరణను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఎక్స్, ఫేస్‌బుక్‌లోనూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికలపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్న మోడీ, ఎక్స్, ఫేస్‌బుక్‌లో కూడా భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. ఎక్స్ వేదికపై మోడీ ఖాతాకు సుమారు 106.2 మిలియన్ (10.62 కోట్లు) ఫాలోవర్లు ఉన్నట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ నాయకులలో ఇదే అగ్రస్థానంగా భావిస్తున్నారు. ఎక్స్ ద్వారా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు, విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ పర్యటనలు, ప్రజా సందేశాలను తరచుగా పంచుకుంటుంటారు.
ఫేస్‌బుక్‌లో కూడా మోడీకి సుమారు 54 మిలియన్ (5.4 కోట్లు) ఫాలోవర్లు ఉన్నారు. దేశీయ రాజకీయ నాయకులతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా అధికం. ఫేస్‌బుక్ వేదికను ఆయన ముఖ్యంగా ప్రజలకు ప్రత్యక్ష సందేశాలు, వీడియోలు, ప్రసంగాల ప్రసారాలకు వినియోగిస్తున్నారు.
