Let's talk: editor@tmv.in
ఇన్‌ఫ్లేషన్ మ్యాన్ మోడీ: కాంగ్రెస్

ఇన్‌ఫ్లేషన్ మ్యాన్ మోడీ: కాంగ్రెస్

Pinjari Chand
8 మార్చి, 2026

ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయనను ‘ఇన్‌ఫ్లేషన్ మాన్ మోడీ’ అంటూ విమర్శించింది. శనివారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రజలపై ద్రవ్యోల్బణం భారాన్ని మోపుతున్నారని ఆరోపించింది. మోడీ ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచింది. గత మూడు నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.307 పెరిగింది. ప్రజలపై ద్రవ్యోల్బణం కొరడా జులిపిస్తున్నారని ఎద్దేవా చేసింది.

కొత్త ధరలు

దేశంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను శనివారం రూ.60 పెంచారు. ఏడాదిలో ఇది రెండోసారి ధరలు పెంచడం. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 7 నుంచి దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీలు) ఢిల్లీ:రూ.853 → రూ.913, ముంబై: రూ. 852.50 → రూ. 912.50, కోల్‌కత్తా: రూ. 879 → రూ. 930, చెన్నై: రూ. 868.50 → రూ. 928.50 గా ఉన్నాయి.

కమర్షియల్ సిలిండర్ (19 కేజీలు)

ఢిల్లీ: రూ. 1768.50 → రూ.1883, ముంబై: రూ. 1720.50 → రూ. 1835, కోల్‌కత్తా: రూ. 1875.50 → రూ. 1990, చెన్నై: రూ. 1929 → రూ. 2043.50 ఏప్రిల్ 2025 నుంచి గృహ వినియోగ సిలిండర్ ధరలు మారలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పెరిగింది.

ఉజ్వల యోజన లబ్ధిదారులపై ప్రభావం

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన 10 కోట్లకుపైగా పేద కుటుంబాలు కూడా ఈ ధర పెంపును భరించాల్సి ఉంటుంది. వారికి ప్రతి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ తర్వాత వారు ఇప్పుడు 14.2 కేజీల సిలిండర్‌కు రూ.613 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి గరిష్టంగా 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

ప్రజల ఆందోళనలు

ధరల పెంపుతో సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని గ్యాస్ వినియోగదారైన అనిత మాట్లాడుతూ ‘మా ఇంట్లో ఒక నెలకు ఒక సిలిండర్ సరిపోదు. పేదవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నెలకు రెండు సిలిండర్లు అవసరం అవుతున్నాయని చెప్పారు. మరో మహిళ మాట్లాడుతూ ఈరోజు గ్యాస్ ధర పెరిగింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతుందని అన్నారు. సల్మా అనే మహిళ మాట్లాడుతూ మేం పేదవాళ్లం. రూ.60 కూడా మాకు చాలా పెద్ద మొత్తం. రోజంతా పని చేసి రాత్రికి తింటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ప్రాంతంలో కూడా ప్రజలు ధరల పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిలిండర్ ధర రూ.60 పెరిగింది. ఇలా పెరిగితే ఖర్చులు ఆదాయాన్ని మించిపోతాయని వారు అన్నారు.

ధరలు పెరగడానికి కారణం

పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు ఏర్పడటం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల వల్ల కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్ రవాణా దాదాపు ఆగిపోయింది. దీంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్‌ టెక్సాస్ ఇంటర్మడియట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $90.90కు చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర $92.69 వరకు పెరిగింది. అలాగే ఎల్‌ఎన్‌జీ ఆసియా మార్కెట్ ధరలు ఎంఎంబీటీయూకు $25.40కు చేరాయి. ఇది మూడు సంవత్సరాల్లో అత్యధిక స్థాయి.

భారత్‌పై ప్రభావం

భారత్ ఎల్‌పీజీ వినియోగంలో పెద్ద దిగుమతి దేశం. 2024–25లో దేశంలో ఎల్‌పీజీ వినియోగం 31.3 మిలియన్ టన్నులు కాగా, దేశీయ ఉత్పత్తి 12.8 మిలియన్ టన్నులు మాత్రమే. మిగతా అవసరాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దిగుమతి చేసుకునే ఎల్‌పీజీలో 85–90 శాతం గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ నుంచి వస్తుంది. ఈ సరఫరా ఎక్కువ భాగం హర్ముజ్ మార్గం ద్వారానే జరుగుతుంది.

ప్రభుత్వ స్పందన

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ దేశంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సరసమైన ధరల్లో ఇంధనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదే సమయంలో ఇండియన్ అయిల్ కార్పోరేషన్ కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలను ఖండించింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపింది.