
ఇనుములో హృదయం మొలవదు
మానవ చరిత్ర ఎన్నెన్నో గొప్పగొప్ప మలుపులు తిరగుతూ, నాగరితకలుగా రూపొందుతూ, అభివృధ్ది చెందుతూ దినదిన ప్రవర్థమానమవుతోంది. గడిచిన రెండు శతాబ్ధాలలో సాంకేతిక పరిజ్ఞానం సాధించిన పురోగతి ఇప్పటి వరకు మానవ చరిత్ర చూడని అద్భుతాలను ఆవిష్కరించింది. మానవ అస్తిత్వం, శ్రమ నిర్వచనం, ఆత్మతృప్తి వంటి అంశాల మీద కూడా సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావాలు ఇక మీద చాలా తీవ్రంగా ఉంటాయనడం లో అనుమానమే లేదు. సాంస్కృతిక, తాత్విక మార్పుల దిశగా ప్రపంచం పరుగులు సాగించడం మొదలుపెట్టింది. మరి ఈ పరుగులో ముందున్నదెవరు? మనిషా? లేక మనిషి మేథ నుంచి ఉద్భవించి మనిషి మేథనే సవాలు చేస్తున్న యంత్రమా? ప్రస్తుత కాలంలో సౌకర్యం, వేగం అనే రెండు అంశాలు కరెన్సీగా మారాయి. మరి ఇదంతా మానవాళిని ఎటు నడుపుతోంది?
ఇది వరకు రోజుల్లో ఒక డాక్యుమెంట్ తయారు చెయ్యాలన్నా, ఒక డిజైన్ మార్చాలన్నా, ఒక కోడ్ రాయాలన్నా మనుషులు మెథస్సును ఉపయోగించి గంటల సమయం వెచ్చించి, నైపుణ్యంతో పనులు పూర్తి చెయ్యాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ అవసరం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే కాదు ఏఐ సుదీర్ఘవ్యాసాలు, కథనాలు నివేదికలు తక్షణం సృష్టించి ఇస్తోంది. కాన్వా వంటి ఏఐ టూల్స్ నిమిషాలు గడవక ముందే ప్రాప్ట్మ్ ను అనుసరించి చిత్రాలు రూపొందిస్తోంది. సెకన్ల వ్యవధిలో పూర్తిస్థాయి ఆడియో విజువల్ డాక్యుమెంట్ సిద్ధమవుతోంది.
ఇందుగలదందు లేదు
ఇదొక మీడియా రూపకల్పనో లేక మరేదో హై ఎండ్, హైటెక్ రంగాలకూ పరిమితం కాలేదు. వ్యవసాయంలో కిసాన్ జీపీటీ వంటి మొబైట్ అప్లికేషన్లు నేల స్వభావాన్ని, వాతావరణ స్థితిగతలును బట్టి విత్తన ఎంపిక, ఎరువుల వాడకం గురించి సలహాలు ఇస్తున్నాయి. ఆరోగ్య సేవా రంగంలోనూ ఏఐ సిస్టమ్ ఎక్స్ రేలు, ఎంఆర్ఐ స్కాన్లను చదివి, డాక్టర్లకు రోగ నిర్ధారణలోనూ సహాయం చేస్తున్నాయి. విద్యార్థులు గంటలు గంటలు శ్రమించి తయారు చేసే నోట్స్ ఏఐ నిమిషాల్లో సంక్షిప్తం చేసి ఇచ్చేస్తోంది.
ఇదంతా మొదట్లో ఒక అద్భుతంలా, ఒక మేజిక్ లా అనిపించడం సహజం. ఇంత త్వరగా పూర్తయిందా? అనే ఆశ్చర్యం కలిగిస్తుంది. పని అయిపోవడానికి పట్టే సమయం చాలా నాటకీయంగా తగ్గిపోయింది. వెనువెంటనే స్క్నీన్ల మీద ఫలితాలు కనిపించడం గొప్ప థ్రిల్ కలిగించడం మనందరికీ అనుభవంలోకి వస్తోంది. వేగం, ఉత్పాదకతా రెండూ పెరిగిపోయాయి. ఈ వేగం వెనుక ఒక గాఢమైన నిశ్శబ్ధం, ఒక మానసిక శూన్యత అత్యంత నెమ్మదిగా చాపకింద నీరులా ప్రవేశిస్తోందని గమనిస్తున్నారా? పని విలువ విపరీతంగా తగ్గిపోతోంది. నిజమే మనిషి చేతికి శ్రమ తగ్గింది, శారీరక అలసట కూడా తగ్గింది. కానీ ఆ శ్రమలో దాగున్న ఆత్మానందం పరిస్థితి ఏమిటి? ఏఐ పనులు చక్కబెడుతోంది సరే! కానీ, మనిషి మనసు ఖాళీ అవుతోందా?
ఇదో కొత్త శాపం
తీరిగ్గా బతికే సౌకర్యం ఉండడం ఒక అదృష్టం ఇది వరకు రోజుల్లో. ఒక వారం పాటు తీవ్రంగా శ్రమించి అలసిన తర్వాత దొరికే విశ్రాంతి ఒక అదృష్టం. అదొక అద్భుత అనుభూతి. మన:శరీరాలు పునరుత్తేజం పొంది ఉత్సాహం సంతరించుకునే మార్గం. ఇప్పటికంటే ఇక ముందు ఏఐ పనులు చక్కబెట్టడం వల్ల విపరీతమైన తీరిక దొరకబోతోంది. మొదట్లో హాయిగా అనిపించినా క్రమంగా అది అశాంతికి దారి తీస్తుంది. తీరిక తొలినాళ్లలో హాయిగా అనిపిస్తుంది. కొంచెం సమయం గడిచేసరికి బోర్ గా మారుతుంది. అన్ని పనులు చక్కబెట్టేందుకు ఏఐ ఉందిగా ఇక మనిషి శ్రమకు ఎలాంటి అవసరం లేదన్న భావం మెదడులో స్థిరమవుతుంది. ఫలితంగా బోర్ కాస్త అసహనంగా మారిపోతుంది. లక్ష్యాలు కొరవడుతాయి. ఏదో చెయ్యాలనే తపన పూర్తిగా నశించిపోతుంది. పెరిగిన అసహనం జీవితాన్ని నిస్సారంగానూ, అర్థం లేనిదిగానూ మార్చేస్తుంది.
చుట్టూ ఉన్న టెక్నాలజీ జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుంది. గొప్ప టెక్నాలజీ, అపార జ్ఞాన సంపద అన్నీ ఉండీ కూడా మనిషి అంతరంగం వెలవెలబోతుంది. తన అవసరం ఏమిటో కూడా తెలియని స్థితికి చేరుకుంటున్నాడు నెమ్మదిగా మానవుడు. చేసే పనికి అర్థం లేకపోవడంతో జీవిత లక్ష్యం కుంటుపడి బలహీనుడు అవుతాడు.
కోల్పోయిన సృజన
పనంటే కేవలం డబ్బు సంపాధించే మాద్యమం మాత్రమే కాదు. అది ఒక ప్రతి సృష్టి, తద్వారా దొరికే ఆనందం, మనిషిననే అహంకారానికి ప్రతీక. వ్యక్తిత్వ వికాసానికి వేదిక. ఒక గోడ అందంగా నిర్మితమైనపుడు ఆ పనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ సాయంత్రానికి ఒక తృప్తితో కూడిన ఆనందంతో పాటు డబ్బు దొరుకుతుంది, ఒక వడ్రంగి శ్రమించి, మేథో మథనం చేసి తన మనసులో రూపానికి చెక్కముక్కలో ఆకృతిని ఇచ్చి ఇది నేను తయారు చేశాను అనే గర్వాన్ని పొందుతాడు. ఒక రచయిత అక్షరాలను కూర్చీ, భావాలను అందంగా పేర్చీ ఒక రచనగా మలుస్తాడు. ఆ కవిత్వంలో అతడి ఆత్మ ఆవిష్కరించబడుతుంది. మరి ఈ పనులన్నీ గంటలు శ్రమించి చేసే పనులు, ఒకేఒక్క మీట నొక్కితే అది స్క్రీన్ మీద ఆవిష్కృతమైనపుడు మనసులో సృజన తాలూకు అనుభూతి చచ్చిపోదా? శ్రమ ఎంత విలువైందో అతి త్వరలో ప్రతి మనిషి అనుభవ పూర్వకంగా తెలుసుకునే రోజులు రాబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే వచ్చేశాయి. ‘‘నేను చేశాను’’ అనే అహం మరణించిన చోట అత్మ తృప్తి, ఆత్మ విశ్వాసం అంతమవుతాయి.
డిజిటల్ బానిసత్వం
ఏఐ యుగంలో మనిషి అత్యంత ఒంటరిగా నిలుస్తున్నాడు. ప్రపంచమంతా కాంతి మయం చేసుకున్నాము, కాంతితో భౌతిక ప్రపంచం చీకటన్నదే ఎరుగకుండా దేదీప్యంగా వెలుగుతోంది కానీ అంతరంగాలు చీకటి లో మగ్గుతున్నాయి. కోట్ల జనాభా కలిగిన సమాజంలో ఒంటరితనం వేధిస్తోంది. అందరూ స్క్రీన్లలో బందీలు. ఏఐ ప్రపంచానికి బానిసలు. ఇప్పుడు సాటి మనుషులతో మాట్లాడడం కంటే ఏఐతో సంభాషించడం ఎక్కువైంది. ఇక్కడ జ్ఞాన సముపార్జనకు లోటు లేదు. సమాచార మార్పిడిలో సమయం పట్టేదీ లేదు. కానీ స్నేహ భావం, సహనుభూతి, మానవత్వపు స్పర్శ కొరవడుతోంది. యంత్రం ఇచ్చే సలహా ఉపయోగకరమే కానీ అది కష్టంలో పాలు పంచుకోలేదు. మనసర్థం చేసుకోలేదు. ఈ ఒంటరితనం, ఒక శూన్యం, అసహనం నుంచి తప్పించుకునేందుకు తిరిగి ఏఐనే ఆశ్రయిస్తాడు. కొత్త చిత్రాలు, కొత్త ఆటలు అన్నీ చేస్తుంటాము, కొంత సమయానికి మనసు డిజిటల్ బ్రమలతో నిండిపోతుంది. కాస్త సమయం గడిచేసరికి తిరిగి శూన్యమే. ఇదే బానిసత్వం అంటే మనిషి తాను సృష్టించిన యంత్రాలకు తానే బానిసై బందీ అవుతున్నాడు. యంత్రాల మీద ఆధారపడడం ఒక మానసిక అవసరంగా మారిపోతుంది.
మేల్కొందామా?
ఏఐ మనిషిని మోసం చెయ్యదు. మనలో ఉన్న శూన్యతకు, కోల్పోయిన ఆత్మతృప్తికి అద్దంలా కనిపిస్తుంది. ఏఐ మన ప్రతిరూపమే. మనిషిని నాశనం చెయ్యదు, మనిషిలోని పనితనాన్ని, ఆత్మను నాశనం చేస్తుంది. ఆత్మను కోల్పోయిన మనిషి తనను తానే నాశనం చేసుకుంటాడు. జీవితానికి అర్థం అంతర్గత నిశ్శబ్ధం ఏనాటికీ వివరించలేదు.
ఈ శూన్యతను పూరించేందుకు ప్రస్తుత కాలంలో మనుషులు చేయ్యాల్సింది అసలైన పనులు. నిజమైన విప్లవాన్ని ఆవిష్కృతం చెయ్యాల్సిన అవసరం ఉంది.
మట్టి, నీరు, గాలి, చెట్టు నీడ, సూర్యోదయం ఇవే ఎప్పటికైనా మనిషిలోని శూన్యాన్ని పూడ్చకగలవు. ఏ యంత్రం సృష్టించలేని అనుభూతులు అప్లికేషన్ల సహాయం లేకుండానే అనుభవించాలి. స్క్రీన్లు పక్కన పెట్టి కాసేపు ఆత్మీయుల తో అనుబంధాలు పంచుకోవాలి. పనులు ఏఐకి వదిలి మావత్వం, కళాసృష్టి, ప్రేమ వ్యాప్తి వంటి వాటి మీద దృష్టి పెట్టాలి.
ఏఐ వినియోగం ద్వారా దొరకిన అపార సమయాన్ని, శక్తిని మరింత మానవతతో, అర్థవంతం చేసుకుని ఆత్మాభివృద్ధికి ఉపయోగించాలి. వీలైనంత త్వరగా అంతర్గత మార్గంలోకి వెళ్లాలి. అదే జీవితం. అదే మేలుకొలుపు. అదే ఏఐ కాలంలో మనిషి సాధించాల్సిన నిజమైన విప్లవం. లేదంటే మనిషికి, యంత్రానికి తేడా ఏటుంటాది?
