
ఇది ప్రజా పాలనా? లేక పోలీస్ రాజ్యమా?
ప్రజా పాలన పేరిట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తున్న తీరు చూస్తే ఇది ప్రజా పాలనా.. లేక పోలీస్ రాజ్యమా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొన్న గిరిజన యువకుడిపై పోలీసులు కక్షపూరితంగా, కులపరంగా దూషించి, స్టేషన్‌కు లాక్కెళ్లి లాఠీలతో దారుణంగా కొట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా రైతులు, గిరిజనులు తమ హక్కుల కోసం ప్రశ్నించడం అనేది సహజమైందే. కానీ, యూరియా మళ్లీ కష్టకాలంలో లేకపోవడం, రైతులు ఇబ్బందులు పడటం పట్ల ప్రభుత్వం కనీస స్పందన చూపకపోవడం ఇప్పటికే ప్రజలను ఆవేదనకు గురిచేస్తోందన్నారు.
అందుకు కౌంటర్‌గా ప్రశ్నించే వారిపై దాడులు చేయడం నిజంగా గుండెల్ని బాధించే విషయమని, ఆ యువకుడు యూరియా కొరతపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా నిలుస్తూ స్థానిక ధర్నాలో పాల్గొన్నాడు. ఇదే పాపంగా భావించి, పోలీసులు అతడిని స్టేషన్‌కు లాక్కెళ్లారు. అక్కడ కులపరంగా దూషిస్తూ, కాళ్లు కట్టేసి లాఠీలతో కొట్టినట్లు తెలుస్తోందని. ప్రస్తుతం ఆ యువకుడు నడవలేని స్థితిలో ఉన్నాడని, అతడి భవిష్యత్తుకు ప్రభుత్వమే బాద్యత వహించాలన్నారు.
రాష్ట్రంలో 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇదొక్కటే కదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్న పరిస్థితిలో ఇటువంటి ఘటనలు రాష్ట్ర పరిపాలన పట్ల మరింత అనుమానాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారంలోకి రావడం అంటే అరాచకానికి అధికారం కలిసొచ్చినట్లే కనిపిస్తోందన్నారు. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అరెస్టులు ఇదే ప్రజాస్వామ్యం. ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఇది ప్రజాస్వామ్యం కాదని, పోలీస్ రాజ్యం" అని విమర్శించారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే, నేరంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి. గిరిజన యువకుడికి మెరుగైన వైద్యం, భద్రత కల్పించడమే కాక, అతడి కుటుంబానికి న్యాయం చేయాలి. అంతేగాక, యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు సరఫరా చేస్తూ, భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలకు తావు లేకుండా చూడాలి హరీష్ రావు తెలిపారు.
