Let's talk: editor@tmv.in
ఇద్దరు చనిపోవడం బాధాకరం

ఇద్దరు చనిపోవడం బాధాకరం

FL - YUGDR
7 అక్టోబర్, 2025

పార్వతీపురం మన్యం జిల్లా కురపాం గిరిజన బాలికలు పచ్చకామెర్ల బారిన పడటం దురదృష్టకరమని, ఇద్దరు పిల్లలు చనిపోవడం విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె. రామకృష్ణ అన్నారు. సోమవారం సిపిఐ నాయకులతో కలిసి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

పిల్లలు చనిపోయారని మంత్రి ప్రకటించలేదని, చనిపోయిన బాలికల కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, బాత్ రూమ్స్, పరిసరాలు బాగోలేని కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అర్థం అవుతుందని, గిరిజన పిల్లలకు ఇలా జరగడం గుణపాఠంగా తీసుకోవాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

చంద్రబాబు విద్యా వ్యవస్థను గాలికి వదిలేస్తున్నారని, మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటుకు ఇస్తున్నారని, విద్య, వైద్య రంగాలను ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందని, చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని, ఇంకొన్ని సంవత్సరాలు చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రభుత్వమే ప్రైవేట్ అయిపోతుందని అన్నారు.

హాస్టల్స్‌లో సౌకర్యాలు లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్‌లో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతున్నామని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన పిల్లల కుటుంబాలకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామకృష్ణతో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, ఎం పైడిరాజు, కె జి సీహెచ్ ఏఐటీయూసీ నాయకులు జె డి నాయుడు, కె సత్యనారాయణ, పి చంద్రశేఖర్, ఎన్ నాగభూషణం, సి ఎన్ క్షేత్రపాల్, ఆర్ శ్రీనివాసరావు, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు చనిపోవడం బాధాకరం - Tholi Paluku