
ఇది విచారణ కాదు.. ప్రతీకారం: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ గురువారం తీవ్రంగా ఖండించింది. ఇది చట్టబద్ధమైన విచారణ కాదని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కక్షసాధింపు రాజకీయమని పార్టీ నేతలు ఆరోపించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చావు నోట్లో తలబెట్టి ‘కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో’ అనే అచంచల సంకల్పంతో ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. సాధించిన తెలంగాణను పదేళ్ల పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన విజనరీ ఆయన” అని అన్నారు. సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి, ఏడాదిలోనే ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విచారణల పేరుతో కేసీఆర్ కి నోటీసులు ఇస్తున్నారు. ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం. నోటీసులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని స్పష్టం చేశారు.
ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే
సీనియర్ నేత టి. హరీష్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. చరిత్రను సృష్టించిన నాయకుడిపై బురద చల్లడం సూర్యుడిపై ఉమ్మి వేయడమే అన్నారు. సింగరేణి కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ నోటీసులని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని స్పష్టం చేశారు.
డైవర్షన్ రాజకీయాలు
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలను డైలీ సీరియల్‌లా నడుపుతోందని బీఆర్‌ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నిన్న హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌కుమార్‌కు నోటీసులు… నేడు కేసీఆర్‌కు నోటీసులు. పరిపాలన లేక డైవర్షన్ మాత్రమే ఉంది అని అన్నారు. నోటీసులతో బీఆర్‌ఎస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుందనుకోవడం కాంగ్రెస్ మూర్ఖత్వమని, రెట్టింపు ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో పోరాడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియకు ట్యాపింగ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి రెండేళ్లుగా బీఆర్‌ఎస్‌ను వేధిస్తున్నారు. ప్రజలను మోసం చేసి పాలన చేతకాకపోతే, తెలంగాణ పోరాట యోధుడైన కేసీఆర్ కే నోటీసులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ సాక్షులుగా విచారిస్తున్నామంటూ దోషుల్లా ప్రచారం చేస్తున్నారు. రెండేళ్లుగా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సిట్ విచారణ పేరుతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే ఇది అని అన్నారు. రైతు భరోసా, ఫించన్ల పెంపు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం మీద, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, తెలంగాణ ప్రజలే దీనికి తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేసింది.
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం… రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)కు ఎస్‌ఐటీ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ, అనుబంధ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇవ్వడమే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రంగా హెచ్చరించాయి.
ఉస్మానియాలో బీఆర్ఎస్వీ ఆందోళన
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని వ్యక్తి కేసీఆర్ అని, అలాంటి నాయకుడి వ్యక్తిత్వాన్ని రాజకీయ లబ్ధి కోసం పలుచన చేయాలనుకోవడం కాంగ్రెస్ తరం కాదని వారు మండిపడ్డారు. కేసీఆర్ పేరు, కీర్తి, ఆయన అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్, పడాల సతీష్, చటారి దశరత్, జంగయ్య, నాగారం ప్రశాంత్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్, అవినాష్, సాయి గౌడ్, బోయపల్లి నాగరాజు, మేడి పవన్, రాకేష్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో ఆగ్రహం
వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితర నేతలు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎస్‌ఐటీ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. కేసీఆర్‌కు ఎస్‌ఐటీ నోటీసులపై నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు వర్ధన్నపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. పాలన విధివిధానాలు తెలియని వారు పాలకులుగా ఉండటం తెలంగాణ దురదృష్టమని, పాలన చేతకాక కేవలం రాజకీయ కక్షతోనే ఎస్‌ఐటీ పేరుతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని వారు ఆరోపించారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేయలేకనే ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇలాంటి డ్రామాలకు తెరలేపుతోందంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారన్నారు.
