Let's talk: editor@tmv.in
ఇది భారత్–పాక్ మ్యాచ్ కాదు.. జయ్ షా వర్సెస్ పాకిస్తాన్: సంజయ్‌రౌత్

ఇది భారత్–పాక్ మ్యాచ్ కాదు.. జయ్ షా వర్సెస్ పాకిస్తాన్: సంజయ్‌రౌత్

Pinjari Chand
16 ఫిబ్రవరి, 2026

భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్‌ను భారత్–పాకిస్తాన్ పోటీగా కాకుండా, ఐసీసీ చైర్మన్ జై షా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లా అభివర్ణించారు. ముంబైలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ ఇది భారత్–పాకిస్తాన్ మ్యాచ్ కాదు. ఇది జయ్ షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. భారత ప్రజలకు ఈ మ్యాచ్ అవసరం లేదు. భారత్ పాకిస్తాన్‌తో ఆడడాన్ని ప్రజలు సమ్మతించడం లేదని అన్నారు.

బెట్టింగ్ ఆరోపణలు

భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌ల సమయంలో భారీ స్థాయిలో బెట్టింగ్, జూదం జరుగుతుందని, అందులో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పాకిస్తాన్‌కు చేరుతుందని రౌత్ ఆరోపించారు. బీజేపీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవహారంలో లాభపడుతున్నారని పేర్కొన్నారు. భారత్–పాక్ మ్యాచ్‌లలో అత్యధికంగా బెట్టింగ్ జరుగుతుంది. గుజరాత్, రాజస్థాన్ నుంచి పెద్ద స్థాయిలో నెట్‌వర్క్ నడుస్తోంది. గత మ్యాచ్‌లో రూ.25,000 కోట్లు పాకిస్తాన్‌కు వెళ్లాయి. ఆ డబ్బు ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. కొంత పహల్గామ్, కొంత పుల్వామా, కొంత ఉరీ, కొంత పఠాన్‌కోట్ దాడులకు వెళ్లిందని ఆయన ఆరోపించారు.

రాజకీయ నేపథ్యం

ఈ వ్యాఖ్యలు భారత్–పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో వచ్చాయి. అంతర్జాతీయ టోర్నమెంట్లలో రెండు దేశాలు తలపడటంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తమ గ్రూప్ దశ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించినప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న మ్యాచ్ ఆడాలని జట్టుకు ఆదేశించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ, ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలని నిర్ణయించింది. భద్రతా కారణాల నేపథ్యంలో వేదిక మార్పు కోరిన బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో ఆ దేశాన్ని టోర్నమెంట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.