Let's talk: editor@tmv.in
ఇది ఇండియా..ఉత్తర కొరియా కాదు: రాహుల్‌గాంధీ

ఇది ఇండియా..ఉత్తర కొరియా కాదు: రాహుల్‌గాంధీ

Pinjari Chand
27 ఫిబ్రవరి, 2026

యువ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు తీసుకున్న చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ, ప్రధాని నరేంద్రమోడీ ఈ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ఘాటుగా ప్రశ్నించారు. ఇది ఇండియా… ఉత్తర కొరియా కాదని ఆయన ఎక్స్‌లో చేసిన హిందీ పోస్టులో పేర్కొన్నారు. శాంతియుత నిరసన ప్రజాస్వామ్యానికి ఆత్మస్వరూపమని, అది నేరం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా ముద్ర వేసే దిశగా నడిపిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నవారు తమను తాము దేశంగా భావించి, విభిన్న స్వరాలను శత్రువులుగా చూడటం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం నశిస్తుందని హెచ్చరించారు. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తే లాఠీలు, కేసులు, జైలు శిక్షలు తప్పవు అన్న పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. పేపర్ లీక్‌లతో ఇబ్బందులు పడుతున్న యువత తమ భవిష్యత్తు కోసం గొంతెత్తగా లాఠీ దెబ్బలు తిన్నారని అన్నారు. దేశ గర్వకారణమైన మహిళా రెజ్లర్లు బీజేపీ నేతపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు కోరితే వారి ఉద్యమాన్ని అణచివేశారని, ఇండియా గేట్ వద్ద అత్యాచార బాధితురాలికి న్యాయం కోరి శాంతియుత నిరసన చేస్తే చెదరగొట్టారని విమర్శించారు.

అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు యువ కాంగ్రెస్ కార్యకర్తలను దేశద్రోహులుగా ముద్రవేసి అరెస్ట్ చేశారని ఆరోపించారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడినప్పుడు వారిని కూడా దేశద్రోహులుగా ముద్రవేశారని చెప్పారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కానన్లు, లాఠీలు ఇవే సంభాషణ సాధనాలుగా మారాయి. నీరు, అరణ్యాలు, భూమి కోసం ఆదివాసీలు అడిగినా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రశ్నలకు భయపడే ప్రధాని ఉన్న ప్రజాస్వామ్యం ఇదేనా? అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలు ఫిబ్రవరి 20న ఢిల్లీలోని భారతమండపంలో జరిగిన ‘షర్ట్‌లెస్ నిరసన’ కేసులో యువ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద అల్లర్లు, విద్వేష ప్రేరేపణ ఆరోపణలు నమోదు చేశారు. ఐవైసీ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ మాజీ ప్రతినిధి భూదేవ్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ కోసం కస్టడీకి అప్పగించారు. ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో కూడా పోలీసులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం బలహీనత కాదు… అది బలం. ప్రభుత్వం విమర్శలను విని స్పందించినప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది. మోదీ జీ, ఇది ఇండియా… ఉత్తర కొరియా కాదు,” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఏ భారత ప్రధాని కూడా ట్రేడ్ డీల్ ను అనుమతించేవారు కాదు

ఇండియా-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే ఈ ఒప్పందం కుదిరిందని, ఇది రైతులకు వ్యతిరేకమని ఆరోపించారు. కేరళలోని పెరవూర్‌లో జరిగిన రైతుల సదస్సులో మాట్లాడుతూ అమెరికా రైతులు సోయాబీన్, మొక్కజొన్న, పండ్లు వంటి పంటలను భారత్‌లో విక్రయించేందుకు అనుమతించడం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ఏ భారత ప్రధాని కూడా ఇది అనుమతించేవారు కాదు. మనం ఎంతో జాగ్రత్తగా నిర్మించిన వ్యవసాయ పునాదిని ఇది ధ్వంసం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం వ్యవసాయ అంశం కారణంగా నిలిచిపోయిందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అమెరికా కంపెనీలకు తెరవడానికి ఇష్టపడలేదని, కానీ అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపుల కారణంగా ప్రధాని ఒప్పందంపై సంతకం చేశారని ఆరోపించారు.

ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చలో తనను మాట్లాడనీయలేదని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. అమిత్ షా లేచారు, ప్రధాని మాట్లాడనీయలేదు, స్పీకర్ కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఇది భారత చరిత్రలో తొలిసారి ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం నిరాకరించిన పేర్కొన్నారు. తాను మాట్లాడబోయేది రెండు అంశాలపై—ఎఫ్ స్టీన్ ఫైల్స్, అమెరికాలోని అదానీ కేసు అందుకే అడ్డుకున్నారని ఆరోపించారు. అదానీ గ్రూప్ సాధారణ కంపెనీ కాదని, అది బీజేపీ, ప్రధానమంత్రికి ఆర్థిక మౌలిక వసతిగా పనిచేస్తోందని ఆయన విమర్శించారు.