
ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు
మతం మారడంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిందూమతం, సిక్కు మతం లేదా బౌద్ధమతం కాకుండా ఇతర మతంలోకి మారిన వ్యక్తిని షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) సభ్యుడిగా పరిగణించలేమని భారత ఉన్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్‌వీ.అంజరియాలతో కూడిన ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారిన వెంటనే, పూర్తిగా తన ఎస్సీ హోదాను కోల్పోతాడని కోర్టు పేర్కొంది. అలాంటి వ్యక్తికి రాజ్యాంగం లేదా చట్టాల ప్రకారం ఎలాంటి రిజర్వేషన్లు, రక్షణలు, ప్రయోజనాలు వర్తించవని స్పష్టం చేసింది. ఈ నిషేధం సంపూర్ణమైనది. ఎలాంటి మినహాయింపులు లేవు. ఒకేసారి ఇతర మతాన్ని అనుసరిస్తూ, ఎస్సీ హోదాను కోరలేరని కోర్టు పేర్కొంది. ఇప్పటికే 1950లో జారీ చేసిన రాజ్యాంగ (షెడ్యూల్డ్ కాస్ట్) ఆర్డర్ ప్రకారం, నిర్దిష్టంగా పేర్కొన్న మతాలు తప్ప ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వెంటనే రద్దవుతుందని కోర్టు గుర్తుచేసింది.
ఈ కేసులో పిటిషనర్ చింతాడ ఆనంద్ అనే పాస్టర్ 2021లో తనపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అయితే, ఆయన క్రైస్తవ మతంలోకి మారిన నేపథ్యంలో ఎస్సీ హక్కులను వినియోగించుకోలేరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రైస్తవ మతంలోకి మారిన తరువాత తిరిగి తన అసలు మతంలోకి చేరలేదని, ఇంకా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ పాస్టర్‌గా కొనసాగుతున్నాడని కోర్టు గమనించింది. ఆ వ్యక్తి గ్రామంలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలోనే సంఘటన జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అందువల్ల ఘటన జరిగిన సమయంలో కూడా అతను క్రైస్తవుడిగానే ఉన్నాడని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, అతను ఎస్సీ హోదాను వినియోగిస్తూ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టలేడని కోర్టు అభిప్రాయపడింది.
మహిళా అధికారులకు పెన్షన్ హక్కు
ఇదే రోజు మరో కీలక తీర్పులో, సైన్యం, నౌకాదళం, వాయుసేనలో పనిచేసిన షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) మహిళా అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు ఉజ్జల్ భుయాన్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. పర్మనెంట్ కమిషన్ ఇవ్వకపోవడం వల్ల సేవల నుంచి ముందుగానే రిలీవ్ అయిన మహిళా అధికారులను, 20 సంవత్సరాల సేవ పూర్తిచేసినట్లుగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. దీని ఆధారంగా వారికి పూర్తి పెన్షన్ ప్రయోజనాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పెన్షన్ 2025 నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2019, 2020, 2021 సంవత్సరాల్లో పర్మనెంట్ కమిషన్ కోసం ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న మహిళా అధికారులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కానీ ఆర్థిక ప్రయోజనాలను నిరాకరించడానికి ఇది కారణం కాదని పేర్కొంది. మహిళా అధికారుల పనితీరు అంచనాల్లో లోపాలు ఉన్నాయని, ప్రమాణాలను స్పష్టంగా వెల్లడించకపోవడం వల్ల వారికి నష్టం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది.
