
ఇండస్ట్రీలో 47 ఏళ్ళ మెగాస్టార్ మారథాన్
టాలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ రాయాల్సి వస్తే అందులో అభిమానులకు గుర్తొచ్చే మొదటి పేరు మెగాస్టార్ చిరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోలకి ఆయన జర్నీ ఆదర్శం. ఆగస్టు 22 ఆయన పుట్టిన రోజు ఎంత ప్రత్యేకమో సెప్టెంబర్ 22 కూడా చిరుకు అంతే ప్రత్యేకమట. ఎందుకంటే ఇండస్ట్రీలోకి చిరు ఎంట్రీ సినీ ప్రయాణం మొదలైన రోజుగా కోట్లాది అభిమానుల కోసం ఒక పండుగగా మారింది. 1978 ఫిబ్రవరి 11లో ‘పునాది రాళ్లు’తో సినిమా రంగంలో అడుగు పెట్టినా, నిజమైన ప్రారంభం ‘ప్రాణం ఖరీదు’తో మొదలైంది. విమర్శకులను సైతం మెప్పించింది చిరు నటన. సాధారణ కుటుంబంలో పుట్టిన చిరు, తన నటనతో వెండి తెరపై తనదైన స్టాంప్ వేశారు. ఎంతో మంది తరువాతి తరం యువ హీరోలకు ఇండస్ట్రీలో దారి వేశారు చిరు. వెండితెరపై తన ప్రతిభతో జగదేకవీరుడుగా నిలిచాడు. ఆయన నటనకు అభిమానుల్లో వచ్చిన స్పందన అమోఘం, చిరు స్టెప్పులకు థియేటర్ లో ఈలలు గోలలు ఓ రేంజ్ లో ఉంటాయి.
తన సినీ ప్రస్థానం మొదలై 47 ఏళ్ళు పూర్తైన సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ఖాతా వేదికగా ఒక పోస్ట్ చేశారు. అభిమానులు ఆయన సినీ ప్రయాణం పై మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ చిరు ప్రతిభను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనవూరి పాండవులు సినిమాతో చిరంజీవి ప్రతిభను ఇండస్ట్రీ గమనించింది. అక్కడి నుంచి ఆయన వెండితెరపై ఆపలేని గెలుపు యాత్ర మొదలైంది. ఖైదీ, అభిలాష, రుద్రవీణ, గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు, ఘరానా మొగుడు, హిట్లర్, చుడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, వాల్తేర్ వీరయ్య, ఆచార్య, ఖైదీ 150, భోళా శంకర్ వంటి అనేక చిత్రాలతో ఆయన సినీ ప్రస్థానం, ఆ స్థాయికి చేరడానికి చిరు శ్రమ వర్ణనాతీతం. చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం, పట్టుదలతో, కష్టపడి సాధించిన అచంచల కృషితో నేడు మెగాస్టార్ స్థాయికి చేర్చింది.
ఇప్పటి వరకు 155 సినిమాలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇంకా కొత్త హీరోలకు పోటీగా అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగు భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’, అలాగే శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో రానున్న సినిమాలతో చిరు తన వర్క్‌ఫ్లో కొనసాగిస్తున్నారు. తాజాగా, విశ్వంభర విఎఫ్ఎక్స్ ఆధారంగా తెరకెక్కుతున్నందువల్ల విడుదలకు కాస్త సమయం ఆగాల్సి వచ్చిన, వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు.
చిరు పోస్ట్, ఆయన మాటల్లో : కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమ. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ.. మీ చిరంజీవి అంటూ అభిమానుల ప్రేమకు కృతఙ్ఞతలు తెలిపారు.
