Let's talk: editor@tmv.in
ఇండియాపై మరో 'విషం'

ఇండియాపై మరో 'విషం'

FL - TRND
25 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఒక సంచలన వ్యాఖ్యతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 80వ వార్షిక సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం మొత్తం యుక్రెయిన్ యుద్ధం చుట్టూనే తిరిగింది. రష్యాపై జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఆయన నేరుగా ఇండియా, చైనాపైనే వేళ్లుపెట్టారు. రష్యా నుంచి చమురు, వాయువులను కొనుగోలు చేస్తూ ఈ రెండు దేశాలు మాస్కో యుద్ధానికి ఆర్థిక బలం ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2022లో మొదలైన ఈ యుద్ధం మూడుున్నరేళ్లు గడిచినా ఇంకా కొనసాగుతుండటానికి ఇదే ప్రధాన కారణమని ఆయన కామెంట్స్ చేశారు.

ట్రంప్ ప్రసంగంలో కేవలం భారత్, చైనా మాత్రమే కాదు.. యూరప్, నాటో మిత్ర దేశాలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. రష్యా నుంచి ఎనర్జీ కొనుగోళ్లు ఆపటంలో యూరప్ విఫలమైందని, అమెరికా ఒంటరిగా అయినా కఠినమైన సుంకాలు విధించడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆగస్టులో ఇండియాపై అదనంగా 25 శాతం దిగుమతి సుంకం విధించి, మొత్తం టారిఫ్‌ను 50 శాతానికి పెంచారు. దీని వెనుక ఉద్దేశం భారత్‌ను రష్యా చమురు ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గించడమే అని ఆయన స్వయంగా ప్రకటించారు.

నిజానికి భారత్ రష్యా చమురుపై విపరీతమైన ఆధారపడిన దేశం. ప్రస్తుతం దాదాపు 40శాతం చమురు రష్యా నుంచే వస్తోంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించినా.. అదే సమయంలో భారత్ తన కొనుగోళ్ల శక్తిని పెంచుకుంది. ఎందుకంటే రష్యా చమురు తక్కువ ధరకు అందించడం ప్రారంభించింది. ఈ వ్యాపార సంబంధం ఇరు దేశాల మధ్య ఒక బలమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా మారింది. అమెరికా విధించే కొత్త శిక్షలు, అదనపు సుంకాలు తాత్కాలిక ఒత్తిడిని కలిగించవచ్చేమో గానీ, రష్యా-భారత్ సంబంధాలను కదిలించలేవు.

మరోవైపు రష్యాతో భారత్ సాగిస్తున్న సంబంధాలు అసలు ఎలా ఉన్నాయన్నదానిపై స్పష్టత అవసరం. ఇండియా రష్యా వద్ద నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా పెద్ద తప్పుగా చూస్తోంది కానీ.. ఇది పూర్తిగా భారత్‌కు వ్యాపార పరమైన అంశం. దేశం రోజుకు కోట్ల లీటర్ల చమురు వాడుతుంది. అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కడ చౌకగా దొరకుతుందో అక్కడ కొనడం తప్పేమీ కాదు. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ, ప్రపంచంలోని ప్రతి దేశం అదే దిశగా నడవాల్సిన అవసరం లేదు. భారత్ ఎప్పటికీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దేశం. అంతేకాదు, చౌకగా చమురు కొనుగోలు చేసి, దాన్ని దేశీయంగా వాడడం ద్వారా భారత్ తన ప్రజలకు ఇంధనం అందిస్తోంది. రష్యా నుంచి కొన్న చమురును ప్రాసెస్ చేసి, కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. ఇందులో ఏ మాత్రం తప్పులేదు.. ఇటు అమెరికా దీన్ని రాజకీయం చేస్తుండడం వల్లే ఇంత వివాదం రాజుకుంది.

అటు వాణిజ్య పరంగా చూస్తే రష్యా-ఇండియా మధ్య గత ఏడాది రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇటు 2030 నాటికి వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే ఇరు దేశాల లక్ష్యం. దీనిబట్టి చూస్తే ట్రంప్ ప్రయత్నిస్తున్న టారిఫ్‌లు, ఇతర ఆంక్షలు రష్యా-భారత్ చమురు వ్యాపారాన్ని దెబ్బతియ్యలేవు. ఎందుకంటే ఇది ఒక 'సూపర్ మెకానిజం' మీద నిలబడి ఉంది. పాశ్చాత్య దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా, రష్యా-భారత్ స్నేహం తనదైన దారిలో ముందుకు సాగుతుంది. ఇది కేవలం ఆర్థిక అవసరం కాదు, ఇది రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలిసిన బంధం. ట్రంప్ టారిఫ్‌లు తాత్కాలిక గాలి తుపాను మాత్రమే, కానీ రష్యా-ఇండియా స్నేహం మాత్రం శాశ్వతం.

ఇండియాపై మరో 'విషం' - Tholi Paluku