
ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు 2 వేల ‘లైట్ మెషిన్ గన్స్’
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ చిన్న ఆయుధాల తయారీ సంస్థ 'ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్' కీలక అడుగు వేసింది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో స్వదేశీ గడ్డపై తయారైన తొలి విడత 'నెగెవ్ (NEGEV)' లైట్ మెషిన్ గన్లను భారత సైన్యానికి అందజేసింది. మొత్తం 41,000 తుపాకుల సరఫరా ఒప్పందంలో భాగంగా.. గత వారాంతంలో 2,000 యూనిట్లను సరఫరా చేసినట్లు సంస్థ బుధవారం ప్రకటించింది.
అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యం
ఈ ఆయుధాల తయారీని ఐడబ్ల్యూఐ, అదానీ గ్రూపుల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ అయిన 'పీఎల్ఆర్ సిస్టమ్స్' చేపట్టింది. భారతదేశంలో చిన్న తరహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేస్తున్న తొలి ప్రైవేట్ సంస్థ ఇదే కావడం గమనార్హం. "భారత రక్షణ తయారీ వ్యవస్థకు మద్దతుగా, అత్యున్నత ప్రమాణాలతో ఒప్పంద షెడ్యూల్ ప్రకారం వీటిని అందజేస్తున్నాం" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 4,000 ఎల్‌ఎమ్‌జీలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.
‘నెగెవ్’ మెషిన్ గన్ ప్రత్యేకతలేంటంటే?
ఇజ్రాయెల్ సైన్యం వాడుతున్న ఈ 'నెగెవ్' తుపాకులు ప్రపంచంలోనే అత్యంత తేలికైనవి కావడంతో వీటిని పట్టుకోవడం, వాడటం సైనికులకు చాలా సులభం. ఎండ, వాన, చలి వంటి ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ఇవి మొరాయించకుండా శత్రువును కచ్చితంగా దెబ్బకొడతాయి. కేవలం చేత్తో పట్టుకోవడమే కాకుండా, వీటిని హెలికాప్టర్లు, యుద్ధ వాహనాలు, నౌకలపై కూడా బిగించి వాడవచ్చు. ఇందులో ఉండే అత్యాధునిక నైట్ విజన్ సౌకర్యం వల్ల చీకటిలో కూడా లక్ష్యాలను స్పష్టంగా చూడవచ్చు. అంతేకాకుండా యుద్ధ సమయంలో సైనికులు ఒత్తిడిలో ఉన్నా సరే, కంప్యూటర్ వ్యవస్థతో పనిచేసే ఈ తుపాకులు గురి తప్పకుండా కాల్పులు జరపడానికి ఎంతగానో సహాయపడతాయి.
మరింత బలోపేతం కానున్న రక్షణ బంధం
భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ సంబంధాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఎల్‌ఎమ్‌జీలతో పాటు 1.70 లక్షల 'క్లోజ్ క్వార్టర్ బాటిల్' కార్బైన్ల సరఫరాకు కూడా పీఎల్ఆర్ సిస్టమ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో మొదటి విడతగా 18,000 యూనిట్లు ఈ ఏడాదే అందనున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన పారిశ్రామిక, సాంకేతిక సహకార ఒప్పందం.. అధునాతన రక్షణ సాంకేతికతను పంచుకోవడానికి, ఉమ్మడి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మార్గం సుగమం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో భారత్ ఆయుధ తయారీలో స్వయంసమృద్ధి సాధించనుంది.
